భద్రాచలం: భద్రాచల రామాలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను కొలువుదీర్చారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేక పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
నేడు చండీహోమం
పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 63034 08458లో సంప్రదించాలని కోరారు.
గోదావరిలో
పెరుగుతున్న ప్రవాహం
భద్రాచలంఅర్బన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి ఉధృతి పెరుగుతుండగా, రాత్రి 12 గంటలకు 17.40 అడుగులుగా నీటిమట్టం నమోదైంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 17.80 అడుగులకు చేరగా, మధ్యాహ్నం 12 గంటలకు 19.30 అడుగులుగా నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 20.10 అడుగులకు చేరుకుంది. గోదావరి ఎగువ ప్రాంతాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


