● సొసైటీ పీఠం కోసం బరిలోకి దిగిన రెండు ప్యానెళ్లు ● అక్టోబర్ 4న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు
భద్రాచలం: ఇంతకాలం ఏకగ్రీమవుతున్న జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీలో ఈసారి ఎన్నికల వేడి రాజుకుంది. చైర్మన్ పీఠం, కమిటీ సభ్యత్వం కోసం రెండు వర్గాలు ఎన్నికల బరిలో దిగాయి. గురువారం నామినేషన్ గడువు ముగియగా మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.
కుదరని ఏకాభిప్రాయం
గతంలో లాగానే చైర్మన్ పదవితోపాటు మొత్తం కమిటీని ఏకగ్రీవం చేసేందుకు రెండు రోజులపాటు భద్రాచలంలో పలువురు వైద్యులు, ప్రముఖులు, సంస్థకు సంబంధించిన ముఖ్యులతో చర్చలు జరిపారు. రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోటీ అనివార్యంగా మారింది. ప్రస్తుతం సంస్థలో 2,524 మంది సభ్యులు ఉన్నారు. గతంలో సుమారు 900 మంది సభ్యులు ఉండగా, తాజాగా మరో 1,624 మంది సభ్యత్వం తీసుకున్నట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి. మాజీ చైర్మన్ డాక్టర్ కాంతారావు 15 మందితో కూడిన ప్యానెల్‌తో బరిలోకి దిగారు. మరోవైపు టీఎన్‌జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు 14 మంది నూతన అభ్యర్థులతో మరో ప్యానెల్‌గా పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు వ్యక్తిగతంగా నామినేషన్లు దాఖలు చేశారు. తుది జాబితా ప్రకటించాక ప్రచారం, సభ్యులతో సంప్రదింపులు, వ్యూహాలతో ఎన్నికల వేడి మరింత రాజుకోనుంది.
ఈ ప్రశ్నలకు బదులేది?
రెడ్‌క్రాస్ ఎన్నికల నేపథ్యంలో అసలు సంస్థలో ఏముంది? ఆదాయం ఎంత? వ్యయం ఎంత? సేవా కార్యక్రమాల నిర్వహణ ఎలా? సభ్యత్వాల పెంపు వెనుక ఉద్దేశం ఏమిటీ? తదితర ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్‌క్రాస్ వంటి సేవా సంస్థలో పదవుల కోసం పోటీ పడటానికి సేవా భావమే ప్రధానమా? లేక మరేదైనా ఆర్థిక ప్రయోజనం ఇమిడి ఉందా? అనే చర్చ కూడా సాగుతోంది. కాగా, సంస్థ ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ, వ్యయాల వివరాలు వెల్లడియితేనే ఈ ప్రశ్నలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


