● అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశం ● గురుకులం నిర్మాణ స్థల సర్వే పరిశీలన
ఇల్లెందురూరల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురకులం భవన నిర్మాణ ప్రదేశంలో భూముల సరిహద్దు నిర్ధారణ కోసం సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ పరిధిలో రెండు సర్వే నంబర్ల వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. సర్వే నంబర్ 618, సర్వే నంబర్ 549/1 భూములకు సంబంధించి రికార్డులు, పాత నక్షాలు, పాస్‌బుక్‌లు, భూభారతి రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన వివరాలకు అనుగుణంగా భూ విస్తీర్ణం, సరిహద్దులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చాలని ఆదేశించారు. సర్వే ఆధారంగా అందుబాటులో ఉన్న రికార్డులతో సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలన్నారు. ఈ క్రమంలో బాధిత రైతులు తమ వద్ద ఉన్న పాత పాస్‌పుస్తకాలను కలెక్టర్‌కు చూపించారు. సుదీర్ఘకాలంగా ఇక్కడే వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నామని, కోర్డు ఆదేశాల మేరకు తాము సాగు చేసుకుంటున్న భూములకు స్పష్టమైన సరిహద్దులు చూపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సర్వే పూర్తి సమగ్ర నివేదికను సమర్పించాలని రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ షాఖాసీం, ఏడీ సర్వే శ్రీనివాస్, ఎంపీడీఓ ధన్‌సింగ్, సర్వేయర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


