మిర్చికి చీడపీడ | - | Sakshi
Sakshi News home page

మిర్చికి చీడపీడ

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

యాజమాన్య పద్ధతులతో నివారణ

ఎదుగుదల లోపించింది..

ఇల్లెందురూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో భిన్నమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటుండగా మిర్చి పంటలో చీడపీడల బెడద ఎక్కువైంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఇతర పంటలకు జీవం పోస్తున్నా మిర్చి తోటలను దెబ్బతీస్తున్నాయి. చీడపీడలు ఆశించి మొక్క ఎదగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముడతతో మొదలై..

సీజన్‌లో ఆగస్టు చివరి వారం నుంచి రైతులు మిర్చి నారు నాటుకోవడం ప్రారంభించారు. ఆరంభంలో వర్షాలు కురవడంతో ఆనందంగా సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఆ వెంటనే ఎండ తీవ్రత అధికం కావడంతో మిర్చికి ముడత తెగులు సోకింది. కొన్ని ఆకులు పైకి మరికొన్ని కిందకు గిన్నెలా ముడుచుకున్నాయి. దీంతో తోటల్లో సగానికి పైగా మొక్కలు మొక్కలు గిడసబారిపోయి ఎదుగూబొదుగూ లేకుండా దర్శనమిస్తున్నాయి. ముడత తెగులు నివారణకు రసాయనాలు పిచికారీ చేస్తుండగానే వేడి వాతావరణం ప్రభావంతో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక బెడద విపరీతంగా పెరుగుతూ ఒక మొక్క నుంచి మరో మొక్కకు వేగంగా వ్యాప్తి చెంది వడలిపోయేలా చేశాయి. ఈ క్రమంలోనే కాండం తొలిచే పురుగు ఆవహించి మొక్కలు విరిగిపోతున్నాయి.

భారంగా పెట్టుబడి..

ముడత, వైరస్‌, కాండం తొలిచే పురుగు ఉధృతి నివారణకు రైతులు పురుగు ముందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పురుగు మందులను పిచికారీ చేస్తున్నా తెగుళ్లు, వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఎకరం విస్తీర్ణంలో పురుగు మందుల పిచికారీ కోసం రూ.10వేలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. వీటికితోడు తెగుళ్ల ప్రభావంతో నేలవాలిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు నారు కొనుగోలు చేస్తుండటంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది.

సమగ్ర యాజమాన్య పద్ధతులతో ముడత, రసం పీల్చే, కాండం తొలిచే పురుగులను నివారించుకోవాలని కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, డాక్టర్‌ శివ సూచిస్తున్నారు. తొలి దశలోనే వైరస్‌ లక్షణాలు కలిగిన మొక్కలను తొలగిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. గట్లపై, పంటలో ఉన్న వైరస్‌లకు స్థావరాలైన కలుపు లేదా వేరే జాతికి చెందిన మొక్కలను తొలగించి పంటలను శుభ్రం చేసుకోవాలని, సిఫారసు చేసిన ఎరువులనే వాడాలని, సకాలంలో నీటి తడులు ఇవ్వాలని తెలిపారు. రసం పీల్చే పురుగు నివారణ కోసం తోటల్లో పసుపు, నీలిరంగు అట్టలను ఎకరానికి 10 నుంచి 15 వరకు పెట్టుకోవాలన్నారు.

నెల రోజుల క్రితం మిర్చినారు నాటాను. పదిహేను రోజుల క్రితం ముడత ఆశించగా ఆ వెంటనే వైరస్‌, కాండం తొలిచే పురుగు ఉధృతి పెరిగి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడింది. నివారణకు రసాయనాలు పిచికారీ చేస్తున్నా మార్పు కనిపించడం లేదు.

– గుగులోత్‌ భద్రు, రైతు, మస్సివాగు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement