● నేలవాలిన పంటచేలు ● ఇళ్లపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికార యంత్రాంగం
బూర్గంపాడు: ఐదు నిమిషాల గాలీ, వాన అతలాకుతలం చేసింది. వందల ఎకరాల పంటచేలను నేలమట్టం చేశాయి. విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలతో గ్రామాల్లో విధ్వంసం సృష్టించాయి. తిరగబడిన ఇళ్ల పైకప్పులు, తెగిన విద్యుత్ కేబుల్ లైన్లతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం సాయంత్రం మోరంపల్లిబంజర, వేపలగడ్డ, కొమ్ము నకిరిపేట గ్రామాల్లో సుడిగాలి తీవ్రతకు భారీగా నష్టం వాటిల్లింది.
నేలవాలిన పంటచేలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు..
గాలి దుమారానికి మోరంపల్లిబంజర, వేపలగడ్డ, కొమ్ము నకిరిపేట గ్రామాల్లోని పత్తి, వరి చేలు నేలవాలాయి. 15 రోజుల్లో పత్తి చేతికందనుండగా.. పొట్ట దశలో ఉన్న వరి మాగాణులు కూడా నేలవాలాయి. సుమారు ఐదువందల ఎకరాలలో పంటనష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే పలుచోట్ల చెట్లు, విద్యుత్ ఇళ్లపై పడటంతో ఇంట్లోని సామగ్రి, రేకులు ధ్వంసమై నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు లేచిపోగా.. తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, ఆటోలు, టూవీలర్స్ తిరగబడ్డాయి.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన..
సుడిగాలి తీవ్రతకు జరిగిన నష్టాన్ని గురువారం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వ్యవసాయశాఖ అధికారులు పంటచేలను పరిశీలించి నష్టం అంచనాలపై నివేదికలు తయారు చేశారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామాలలో జరిగిన నష్టాన్ని నమోదు చేసుకున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు. అధికారులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించి హామీలిచ్చారు.


