భద్రాచలంఅర్బన్: ఆటోలో బంగారు ఉంగరాలు, నగదు కనిపించాయి.. ఎవరూ చూడలేదు కదా అని తన వద్దే ఉంచుకోలేదు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు భద్రాచలం సీతారాంనగర్ కాలనీకి చెందిన చుంచుపల్లి కాత్యాయనీ. ఏఎస్‌ఆర్ కాలనీకి చెందిన నవ్య గురువారం ముత్తూట్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఇంటి వద్ద దిగే హడావుడిలో రెండు బంగారు ఉంగరాలు, రూ.23,340ల నగదును ఆటోలోనే మరిచిపోయారు. ఆ తర్వాత అదే ఆటో ఎక్కిన కాత్యాయనీ వాటిని గుర్తించి వెంటనే టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆరా తీసిన పోలీసులు నవ్యకు సమాచారం అందించి సీఐ నాగరాజు, టౌన్ ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యాన రెండు బంగారు ఉంగరాలు, రూ.23 వేల నగదు అందజేశారు. ఈమేరకు కాత్యాయనీని ఎస్‌ఐతో పాటు పలువురు అభినందించారు.


