అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ఉంది.. | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ఉంది..

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

● లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక ● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

● లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక ● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచరూరల్‌: అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఉంది.. కానీ అక్కడ నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ పద్ధతిన పారదర్శంకగా కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్‌ ఏరియాలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను మండల పరిధిలోని పెద్దమ్మగుడి దేవాలయానికి చెందిన ఫంక్షన్‌హాల్‌లో తహసీల్దార్‌ దారా ప్రసాద్‌ ఆధ్వర్యాన లాటరీ పద్ధతిలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 360 డబుల్‌ బెడ్రూం ఇళ్లకు గాను 4,061 దరఖాస్తులు రాగా ఇందులో అర్హులైనవారు 1,254 మాత్రమే ఉన్నారని, వారికి మాత్రమే లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. తక్కువ ఇళ్లకు ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటంతో ప్రభుత్వ ఆదేశానుసారం చిన్నపిల్లలతో లాటరీ తీయించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ.. ఇల్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు, పైరవీలకు అవకాశం లేకుండా డ్రా పద్ధతిలో 360 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇందులో ఎస్సీలకు 61, ఎస్టీలకు 22, మైనార్టీలకు 43, దివ్యాంగులకు 18 ఇళ్లు కేటాయించామని, మిగిలినవి కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఆతర్వాత లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధు, కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ గణేష్‌, డిఫ్యూటీ మేయర్‌ లలితకుమారి, కమిషనర్‌ సుజాత, డీసీసీ కార్పొరేటర్లు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో వాగ్వాదం

డ్రా పద్ధతిలో జరిగిన లబ్ధిదారుల ఎంపికలో బీసీలపై వివక్షత చూపుతున్నారని, ఈ ఎంపికలు నిలిపివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వేదికపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలపడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బైరెడ్డితో పాటు బీజేపీ నాయకులను బయటకు పంపించారు. ఈక్రమాన బీజేపీకి చెందిన మహిళా నాయకురాలు వీడియో తీయగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబిర్‌పాషా గమనించి ఆ వీడియోను డిలీట్‌ చేశారు. అనంతరం బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో సహా మొత్తం 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

50 శాతం ఉన్న బీసీలకూ ఇళ్లు ఇవ్వాలి

లాటరీ ద్వారా ఇళ్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సాంబశివరావు రిజర్వేషన్‌ అమలు విధానం తీసుకురావడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడంలో అభ్యంతరం లేదు కానీ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కోసం 50శాతం ఉన్న బీసీలకు కేటాయించకుండా 12శాతం ఉన్న ముస్లింలకు 42 ఇళ్లు ఇవ్వడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 2016 జీఓను తీసుకొచ్చి అమలు చేయడం సరికాదన్నారు.

కొత్తగూడెంలో మిగిలిన 214 ఇళ్ల కేటాయింపు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అర్హులందరికీ దశలవారీగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం మండలంలో మిగిలి ఉన్న 214 డబుల్‌ బెడ్రూం ఇళ్ల ఎంపిక కోసం గురువారం కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం మండలంలో మొత్తం 756 డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఉండగా, ఇప్పటికే 542 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు తెలిపారు. ఇందులో ఎస్సీలకు 17 శాతంతో 36 ఇళ్లు, ఎస్టీలకు 6 శాతంతో 13 ఇళ్లు, బీసీ–ఓసీ కేటగిరీలకు 65 శాతంతో 139 ఇళ్లు, మైనారిటీలకు 12 శాతంతో 26 ఇళ్లు కేటాయించారు. ఇందులో 203 ఇళ్లు సాధారణ కేటగిరీకి, 11 ఇళ్లు దివ్యాంగుల కేటగిరీకి ఇచ్చారు. ప్రస్తుత దశలో మొత్తం 2,547 మంది అర్హులు ఉండగా.. వీరిలో ఎస్సీ కేటగిరీలో 741 మంది, ఎస్టీ కేటగిరీలో 161 మంది, బీసీ–ఓసీ కేటగిరీలో 1,253 మంది, మైనారిటీ కేటగిరీలో 392 మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 214 ఇళ్లకు అర్హులైన వారి సంఖ్య 2,500కు పైగా ఉండటంతో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో వంద శాతం పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, డిప్యూటీ మేయర్‌ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ చైర్మన్‌ పసుపులేటి వీరబాబు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాస్‌, కొత్తగూడెం సహకార సంఘం అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement