నూతన వంతెన నిర్మిస్తాం | - | Sakshi
Sakshi News home page

నూతన వంతెన నిర్మిస్తాం

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి: రాజుపేట శివారులోని పాములేరు వాగుపై కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన తక్షణమే నిర్మిస్తామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. పాల్వంచ–మందలపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డులో కూలిన బ్రిడ్జిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో వచ్చిన వరద ఉధృతికి పిల్లర్లు కుంగి, వంతెన కూలిపోయిందన్నారు. ఆ బ్రిడ్జిని పూర్తిగా తొలగించి, హైలెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. అనంతరం ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ లాల్‌సింగ్‌ వంతెనను పరిశీలించి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రద్దీకి అనుగుణంగా నూతన వంతెన ఎత్తు పెంచుతామన్నారు. పాల్వంచ నుంచి వచ్చే భారీ, అతిభారీ వాహనాలు కొత్తగూడెం, వీఎం బంజర, సత్తుపల్లి మీదుగా మందలపల్లికి వెళ్లాలని తెలిపారు. మందలపల్లి నుంచి వచ్చే భారీ, అతిభారీ వాహనాలు అశ్వారావుపేట, వినాయకపురం, కుక్కునూరు, బూర్గంపాడు మీదుగా పాల్వంచ వెళ్లాలని సూచించారు. బైక్‌లు, ఆటోలు, కార్లు, చిన్నవాహనాలు పాల్వంచ నుంచి ములకలపల్లి సాయిబాబా గుడి, జీపీ ఆఫీస్‌ రోడ్డు, గొల్లగూడెం మీదుగా కంపగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రాకపోకలు సాగించాలని తెలిపారు. కాగా, ఘటనపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్‌అండ్‌బీ ఈఈ శంకర్‌రావుతో ఫోన్లో మాట్లాడి, వివరాలు ఆరా తీశారు. కొత్త వంతెన నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఈఈ శంకర్‌రావు, డీఈలు విశ్వనాథ్‌, ప్రకాష్‌, తహసీల్దార్‌ స్వాతిబిందు, ఎంపీడీఓ సత్యనారాయణ, ట్రాన్స్‌ కో ఏఈ నరేష్‌, నాయకులు నరాటి ప్రసాద్‌, పైడి వెంకటేశ్వరరావు, బత్తుల అంజి, కారం సుధీర్‌, కొయ్యల అచ్యుతరావు, పుష్పాల చందర్‌రావు, బండి కొమరయ్య, శగనపాటి సీతారాములు తదితరులు ఉన్నారు.

గంజాయి కేసులో నిందితుడి ఆస్తుల జప్తు

రూ.21.15 లక్షల విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతా సీజ్‌

పినపాక: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి ఆస్తులను జప్తు చేసినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. 2025 ఆగస్టు 28న నమోదైన కేసులో నిందితుడు పల్లపు రఘు గంజాయి అక్రమ రవాణా ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇందులో భాగంగా అతని పేరుతో ఉన్న రెండు కార్లు, ఒక మోటార్‌ సైకిల్‌, భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతాను న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జప్తు చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.21,15,907గా పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేస్తామని సీఐ తెలిపారు. కాగా, దర్యాప్తు చేపట్టిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సురేష్‌, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఐపీఎస్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement