రాయపర్తి: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తుకు వెళ్లగా బైక్ ఢీకొట్టడంతో మృతి చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న(57) అంత్యక్రియలు గురువారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కొత్తగూడెం టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వెంకన్న బుధవారం మృతి చెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం తీసుకెళ్లగా, పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై వెంకన్నకు భార్య హచ్చమ్మ, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఎస్సై కుటుంబానికి అండగా ప్రభుత్వం : సీఎం
సాక్షి, హైదరాబాద్/సూపర్‌బజార్(కొత్తగూడెం): గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్‌ఐ కె.వెంకన్న వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడి మృతి చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి ఏరేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఎస్సై వెంకన్న మృతిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా సంతాపం తెలిపారు.


