చివరి మాక్‌డ్రిల్ 2023లోనే..
అత్యవసర పరిస్థితికి ప్రత్యేక ప్రణాళిక
● ఆదిలాబాద్ రిమ్స్ ఘటనతో చర్చ ● భద్రాచలం ఎస్‌ఎన్‌సీయూలో కానరాని స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు, పైప్‌లైన్ ● నిధుల లేమితో ఫైర్ ఎన్‌ఓసీలో జాప్యం ● చివరి మాక్‌డ్రిల్ మూడేళ్ల క్రితం నిర్వహణ
భద్రాచలంఅర్బన్: పుట్టినప్పుడే అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ) చికిత్స అందిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతానికి కీలక వైద్య కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 20 పడకలతో కూడిన ఎస్‌ఎన్‌సీయూ ఉండగా.. ఈ విభాగంలో వార్మర్లు, ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీలో సమస్యతో పొగ వస్తే... తొలి క్షణాల్లోనే గుర్తించే వ్యవస్థ ఉందా, పరిస్థితి విషమించి మంటలు చెలరేగితే పసికందులను ఎంత వేగంగా సురక్షిత ప్రాంతానికి తరలించగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఈ చర్చ మొదలైంది. ఈమేరకు ఆస్పత్రిలో ‘సాక్షి’ మంగళవారం పరిశీలించగా అగ్నిమాపక పరికరాలు, ఫైర్ ఎగ్జిట్ వంటి ఏర్పాట్లు ఉన్నా ఎస్‌ఎన్‌సీయూలో పొగను స్వయంచాలకంగా గుర్తించే స్మోక్ డిటెక్టర్లు కానీ స్ప్రింక్లర్లు, ఫైర్ పైప్‌లైన్లు లేనట్లు తేలింది. అంతేకాక ఫైర్ అలారం కూడా దానికదే కాకుండా ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది మోగించాల్సిందే.
ప్రతీ నిమిషం కీలకమే..
ఆస్పత్రిలోని 20 పడకల ఎస్‌ఎన్‌సీయూ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22,919 మంది నవజాత శిశువులకు ఇక్కడ వైద్యసేవలు అందాయి. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. ఏదైనా ఆపద వస్తే సిబ్బందే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. పైగా కొందరు ఆక్సిజన్, వార్మర్లు, ఇతర వైద్య పరికరాలపై ఆధారపడి ఉండడంతో తరలింపు మరింత జాగ్రత్తగా జరగాలి. ఎస్‌ఎన్‌సీయూలో నాలుగు అగ్నిమాపక పరికరాలు ఉండగా అత్యవసరంగా బయటకు వెళ్లేందుకు ఫైర్ ఎగ్జిట్ ఉంది. అయితే పొగ మొదలుకాగానే హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తోంది. మంటలను సిబ్బంది గుర్తించి స్పందించడం కంటే.. పొగ మొదలైన క్షణాల్లోనే ప్రమాదాన్ని బయటకు తెలియజేసే ఈ వ్యవస్థ కీలకం.
నిధుల దగ్గరే ఆగిన ఎన్‌ఓసీ
ఏరియా ఆస్పత్రిలో మొత్తంలో 50 అగ్నిమాపక పరికరాలు ఉండగా, వినియోగంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. విద్యుత్ వ్యవస్థను తనిఖీ చేయడంతోపాటు అవసరాల ఆధారంగా ఏసీలకు సర్వీసింగ్ చేస్తున్నారు. అయినా ఆస్పత్రికి ఫైర్ ఎన్‌ఓసీ ప్రక్రియ పూర్తికాలేదు. నిధుల సమస్యతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వచ్చే ఆస్పత్రిలో బడ్జెట్ కారణంగా కీలకమైన భద్రతా పనులను పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు, ఫైర్ పైప్‌లైన్ వ్యవస్థలను అమర్చి ఎన్‌ఓసీ ప్రక్రియ పూర్తి చేస్తే అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.
అగ్నిమాపక పరికరాలు ఎన్ని ఉన్నాయన్న దానికంటే ప్రమాదం వచ్చినప్పుడు ఎంత వేగంగా ఉపయోగించగలరన్నదే కీలకం. భద్రాచలం ఆస్పత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన 2023లోనే చివరిసారిగా మాక్‌డ్రిల్ జరిగింది. అప్పటి సిబ్బంది పలువురు బదిలీ కాగా, ఆ స్థానంలో కొత్త వారు వచ్చారు. దీంతో అనుకోని ప్రమాదం జరిగితే వీరిలో ఎందరు వేగంగా స్పందించగలరు, పసికందులను ఎంత సమయంలో బయటకు తరలించగలరు.. మంచానికే పరిమితమైన, ఆక్సిజన్‌పై ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆదిలాబాద్ ఘటన నేపథ్యాన భద్రతా ఏర్పాట్లను మరోమారు పరిశీలించడమే కాక పూర్తిస్థాయి మాక్‌డ్రిల్ నిర్వహించాలనే సూచనలు వస్తున్నాయి.
అగ్ని ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రణాళిక ఉంది. ము ఖ్యంగా ఎస్‌ఎన్‌సీ యూలోని పసికందులను సురక్షితంగా తరలించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. మాస్ క్యాజు వాలిటీ సమయంలో అనుసరించే విధానంలోనే వైద్యులు, నర్సులు, సిబ్బందిని రెస్క్యూలోకి తీసుకొస్తాం. ఆస్పత్రిలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతాం. – డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి,
ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్


