సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్క్‌షాప్‌లో ఆయుధాల నిర్వహణ, మరమ్మతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు. కొత్తగూడెంలోని ఓఎస్డీ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆయన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, ఆయుధ కర్మాగార వర్క్‌షాప్, సిబ్బంది బ్యారక్స్‌ను పరిశీలించారు. ఆయా విభాగాల్లో సిబ్బందికి అందుతున్న వసతి, పరికరాలపై ఆరా తీశాక మరమ్మతులు అవసరమైతే చేయించాలని అధికారులకు సూచించారు. అలాగే, జాగిలాల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ నేరాల ఛేదనలో సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ వద్ద పరికరాలు, భద్రతా సామగ్రి, వర్క్‌షాప్‌లో ఆయుధాల నిర్వహణ, మరమ్మతులపై సూచనలు చేశారు.
గణేష్ నిమజ్జనానికి బందోబస్తు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా వేయి మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా, నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించామని వెల్లడించారు. భద్రాచలం నిమజ్జనం ఘాట్‌కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పరిసరాల్లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. కాగా, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్‌పై పోలీసు అధికారులు శ్రద్ధ వహించాలని, డీజేలు, టపాసులను అనుమతించొద్దని సూచించారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, గణేష్ మండపాల నిర్వాహకులు కూడా పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా సహకరించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ ఓ ప్రకటనలో సూచించారు.
ఓఎస్‌డీ కార్యాలయంలో పరిశీలించిన
ఎస్పీ రోహిత్‌రాజ్


