నేడు జిల్లాలో మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

భద్రాచలం/అశ్వాపురం: రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. మంత్రి పొంగులేటి ఉదయం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పూజలు చేసి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరులో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీని వాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభి స్తారు. కాగా, అక్కడి నుంచి మంత్రి తుమ్మల ఖమ్మం చేరుకుని ముస్తఫానగర్‌ సెంటర్‌లో జరిగే గణేశ్‌ శోభాయాత్రలో పాల్గొంటారు.

నేటి నుంచి క్లస్టర్‌ స్థాయి క్రీడా పోటీలు

టేకులపల్లి: టేకులపల్లిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు క్లస్టర్‌ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈమేరకు వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్‌ నిషాంత్‌ కృష్ణవ మంగళవారం వెల్లడించారు. టేకులపల్లితో పాటు గండుగులపల్లి, ములకలపల్లి, చర్ల, పాల్వంచ, గుండాల, సింగరేణి, దుమ్ముగూడెంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఖో–ఖో, వాలీ బాల్‌, పరుగు పందెం తదితర అంశాల్లో పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో మొరాయించిన సర్వర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: రిజిస్ట్రేషన్‌ శాఖలో మంగళవారం సర్వర్‌ మొరాయించగా సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో ఈ పరిస్థితి నెలకొనగా ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజువారీ పనులు ఆలస్యమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సమస్య కొనసాగగా ఒక్కో డ్యాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు దాదాపు గంటన్నరకు పైగా సమయం పట్టింది. దీంతో కార్యాలయాలకు వచ్చిన వారే కాక అధికారులు అవస్థలు ఎదుర్కొన్నారు.

పాఠశాలల్లో ‘స్వచ్ఛత’ కార్యక్రమాలు

బూర్గంపాడు: పాఠశాలల్లో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాలు చేపడుతూ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్‌ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండలంలోని మోరంపల్లిబంజర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆమె మొక్కలు నాటి మాట్లాడా రు. తడి, పొడి చెత్త, వైద్య వ్యర్థాలు, శానిట రీ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని, తడి చెత్తతో వర్మీ కంపోస్ట్‌ తయారీపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని తెలిపారు. పొడి చెత్తలో రీస్లైకింగ్‌ వ్యర్థాలను వేరుచేసి వాటిని విక్రయి స్తే ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ రామకృష్ణ, సర్పంచ్‌ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్‌ పొక్కుల రవి తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

ఖమ్మం వైరారోడ్‌: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఖమ్మం బుర్హాన్‌పురంలోని క్యాంపు కార్యాలయంలో 34 మందికి రూ.7లక్షల విలువైన చెక్కులను మంగళవారం అందజేశాక ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దండా జ్యోతిరెడ్డి, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, హరిప్రసాద్‌, పాల నాగేశ్వరరావు, లేడిబోయిన గోపాలరావు పాల్గొన్నారు.

వినాయక మండపాల్లో పూజలు

పాల్వంచ: పాల్వంచలోని పలు డివిజన్లలో గణేష్‌ మండపాల వద్ద మంగళవారం ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను నిర్వహకులు సన్మానించారు. నాయకులు మల్లెల రవి చంద్ర, దాసరి సురేష్‌, నాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement