భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి, పునరుద్ధరణ పనులపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సమీక్షించనున్నారు. ఇటీవల రామాలయ వైదిక పెద్దలు సూచించిన మార్పులపై మంత్రి నేతృత్వాన జరిగే సమావేశంలో సమీక్షిస్తారని తెలిసింది. ప్రధానంగా దక్షిణం వైపు నిర్మిస్తున్న ఉపాలయాలకు భూస్పర్శ ఉండాలని వారు కోరడంతో అందుకు తగినట్లు మార్పులతో ప్లాన్ రూపొందించినట్లుగా సమాచారం. అలాగే, స్వామి వారి మూలమూర్తులకు ఇరువైపులా లక్ష్మీతాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల ఉపాలయాలను సూచించగా, దానిపై మంత్రి సలహాలు, సూచనల మేరకు అర్కిటెక్ట్‌లు నిర్ణయం తీసుకునే అవకాశముంది. అర్చకులు సూచించినట్లుగా భూస్పర్శ మేరకు ఉపాలయాలను నిర్మిస్తే, గత ప్లాన్‌లో పొందుపర్చిన దర్బార్ సేవా మండపం, హుండీ లెక్కింపు మండపాల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. మొత్తంగా మంత్రి పొంగులేటి సమీక్ష అనంతరం స్పష్టత రానుంది.
నేడు పొంగులేటి సమీక్షలో మరింత స్పష్టత


