భద్రాచలం: మాతృభాషపై పట్టు పెంచుకోవడం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. తెలుగు భాషపై గిరిజన విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు వారిలో సృజనాత్మక ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్‌లో మంగళవారం పోటీలు నిర్వహించగా తొలుత కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. ఆతర్వాత పీఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో తెలుగు భాషపై పట్టు పెంచేలా పోటీలను నిర్వహించామని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు పీఓ బహుమతులు అందజేశారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీలు ఫిరంగి, చందన, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు రమేష్, రాములు, చంద్రమోహన్, రాధమ్మ, భారతీదేవి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్


