అశ్వారావుపేటరూరల్: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఓ బాలుడి వైద్యానికి నగదు వితరణగా అందిస్తామని చెప్పిన కేటుగాళ్లు సైబర్ మోసానికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో గతకొంతకాలంగా అద్దె ఇంట్లో జీవ నం సాగిస్తున్న తాపీ కార్మికుడు రుక్కం రాజేష్, ప్రశాంతి దంపతుల ఏడేళ్ల కుమారుడు రీత్విక్ జోఝెల్ అరుదైన డీఎండీ(డ్యూచేన్ మస్క్యులర్ డిస్ట్రోఫి) అనే వ్యాధితో పుట్టుక నుంచే బాధపడుతున్నాడు. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చూపించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడికి డీఎండీ వ్యాధి ఉన్నట్లు గుర్తించి నివారణకు విదేశాల నుంచి రూ.26కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సోషల్ మీడియాలో వీడియోలు..
విషయం తెలిసిన నాటి నుంచి బాలుడి వైద్యానికి సాయం చేయాలని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయగా, ఈ వీడియోలు చూసిన గుర్తు తెలియన సైబర్ నేరగాళ్లు బాలుడి వైద్యానికి రూ.25లక్షల వితరణ అందిస్తామని ఈ నెల 11వ తేదీన సంధ్య ఫౌండేషన్, రామ్‌రాజ్ కాటన్ దుస్తులు, నకిలీ ‘హర్షసాయి’ప్రొఫైల్‌తో వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి మాట్లాడారు. అయితే, తాము నగదు సాయం చేసేందుకు ముందుగా ప్రాసెస్ ఫీజు కింద కొంతనగదు చెల్లించాలని చెప్పడంతో బాధితుడి నమ్మి విడతల వారిగా మొత్తం రూ.83వేలను ఫోన్‌పే ద్వారా పంపించాడు. కొద్ది రోజుల్లో సాయం అందుతుందని చెప్పిన కేటుగాళ్లు, ఆనాటి నుంచి ఫోన్లు స్విచాఫ్ చేశారు. రోజులు గడుస్తున్న సాయం అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం బాధితుడు విలేకరులకు చెప్పాడు.
వైద్యానికి సాయం చేస్తామని
రూ.83వేలు కాజేసిన వైనం


