ఈ నెల 24న నామినేషన్లు, అక్టోబర్ 4న ఎన్నికలు పోటీకి ఆసక్తి చూపుతున్న పలువురు ఏజెన్సీలో ప్రజాసేవలో సంస్థది కీలక పాత్ర రక్తం విక్రయాలు, ఎన్నికల్లో జాప్యంపై మాత్రం విమర్శలు
బరిలో పలువురు..
భద్రాచలం: విపత్కర, ఆపద సమయాల్లో సేవలందించే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో ఎన్నికల నగారా మోగింది. జిల్లా శాఖల మేనేజింగ్ కమిటీల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 30 జిల్లా శాఖలకు ఒకేసారి అక్టోబర్ 4 ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర శాఖ నిర్ణయించింది. దీంతో భద్రాచలంలో సైతం ఎన్నికల హడావుడి మొదలయింది. 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు ఈ నెల 24న నామినేషన్లు స్వీకరించనున్నారు. 25న పరిశీలన, 26న ఉపసంహరణ, 26న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. అక్టోబర్ 4న కలెక్టరేట్‌ల పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జె.సునీత నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
భద్రాచలంలో విశిష్ట సేవలు
1920లో ఏర్పడిన రెడ్ క్రాస్ సొసైటీ చట్టం కింద భద్రాచలంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ విశిష్ట సేవలను అందించింది. భద్రాచలంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్‌కు హోల్‌బ్లడ్‌తో పాటు ప్యాక్డ్ రెడ్ సెల్స్, వాష్డ్ రెడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, ప్లేట్‌లెట్ కాన్సన్‌ట్రేట్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా వంటి రక్త భాగాల సేవలను అందిస్తోంది. అత్యవసర వైద్య సేవలకోసం గిరిజన ప్రాంతాలకు ఎలక్ట్రిక్ ఆటో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడంతోపాటు పలువురికి హైజీన్ కిట్ల పంపిణీ చేపట్టింది. తలసేమియా, సికిల్ సెల్, అనీమియా వార్డుల విస్తరణ సైతం చేపట్టింది. భద్రాచలంలో కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి జరుగుతోంది.
సంస్థ కార్యకలాపాల గోప్యతపై ఆరోపణలు
భద్రాచలం రెడ్ క్రాస్ సంస్థ విశిష్ట సేవలను అందించటంలో ముందున్నా ఆ సంస్థ కార్యకలాపాలను గోప్యంగా ఉంచటంపై ఆరోపణలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంలో ఒకే కమిటీ పాలనలో ఉండటంతోపాటు ఆదాయ, వ్యయ ఖర్చులను బహిరంగ పర్చటం లేదని, ఉచితంగా, తక్కువ ధరకు అందిచాల్సిన రక్తం, ప్లేట్‌లెట్స్ ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం స్థలం ఆక్రమించుకుని నిర్మాణాలను చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం విభాగంలో అనేక అవినీతి అరోపణలు ఉండటంతోనే డ్రగ్స్ విభాగం, ఇతర అధికారులను ‘మామూళ్ల’తో నోరు మూయించారని పలువురు ఆరోపిస్తున్నారు. మూడేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలను కావాలనే ఆలస్యం చేస్తూ, అదే నాయకత్వం నడిచేవిధంగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. సుదీర్ఘకాలంపాటు చైర్మన్లుగా వ్యవహరించిన డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ కాంతారావు మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని భద్రాచలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ డివిజన్ అధ్యక్షుడు పరిమి సోమశేఖర్, అదే సంస్థకు సెక్రటరీగా ఉన్న చల్లగుళ్ల నాగేశ్వరరావు సోషల్ మీడియాలో ప్రకటించారు. గాంధీపథం కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏకగ్రీవం కోసం కాంతారావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


