ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు..
లాభాల వివరాలు వెల్లడించిన యాజమాన్యం
ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులు
రుద్రంపూర్: సింగరేణి కార్మికులు లాభాల వాటా కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా యాజమాన్యం లాభాలు ప్రకటించలేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, 62.17 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేశారు. 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 69 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగా, రూ. 6,393 కోట్ల లాభం వచ్చినట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ 29న 34 శాతం వాటాగా రూ.802.4 కోట్లను కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది లాభాల్లో 40 శాతం వాటా పర్మనెంట్, 10 శాతం వాటా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, గతంలో యాజమాన్యం లాభాల వాటాను విద్యాసంస్థల పునః ప్రారంభ సమయంలో చెల్లించేది. క్రమంగా అది కాస్తా దసరాకు చేరింది. గతేడాది దసరా ముందు చెల్లించిన యాజమాన్యం ఈ ఏడాది ఇంకా లాభాలను ప్రకటించలేదు.
ఆ రూ.6,315 కోట్లు ఏమయ్యాయి?
సింగరేణి సంస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో నూతన గనులు, సంస్థ అభివృద్ధి కోసం రూ. 2,283 కోట్లను యాజమాన్యం పక్కనపెట్టింది. 2024–25లో లాభాలు రూ.6,393 కోట్లు రాగా, సుమారు 4,034 కోట్లు పక్కన పెట్టింది. మొత్తం రూ.6,315 కోట్లు మిగల్చగా, ఆ సొమ్ము ఏమైందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రూ. 4,300 కోట్ల ఓడీ కూడా ఎందుకుందనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది.
పేరుకుపోతున్న బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో సింగరేణికి విద్యుత్ సంస్థలు రూ.19,733 కోట్ల బకాయి పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అవి రూ. 56 వేల కోట్లకు చేరాయి. బకాయిలు వసూళ్లలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని, కార్మిక నేతలు కూడా మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు వసూలు చేస్తే కంపెనీ ఆర్థికపరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది.


