● ఐదో రోజు భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జనం ● నది కలుషితం కాకుండా పూజ సామగ్రి సేకరణకు ప్రత్యేక కౌంటర్లు
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదీ తీరాన వినాయక నిమజ్జన వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఐదో రోజు గణనాథుల ప్రతిమలను భక్తులు నిమజ్జం చేస్తున్నారు. ఈ ఏడాది మూడో రోజు నుంచే విగ్రహాలు భద్రాచలానికి తరలివస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి శనివా రం సుమారు 50కి పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ అధికారులు విగ్రహాలను నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జన ఘాట్ వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ విద్యుత్ దీపాలను (లైటింగ్) ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. గోదావరి నదిని, పర్యావరణాన్ని కాపాడేందుకు అధికారులు ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులు విగ్రహాలతోపాటు తీసుకువచ్చే పూజా పత్రి, ప్లాస్టిక్ కవర్లు, ఇతర పూజా సామగ్రిని నదిలో వేయకుండా ఘాట్ వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి సేకరించిన ఆ వ్యర్థాలను సిబ్బంది అక్కడికక్కడే తొలగిస్తున్నారు. సురక్షితంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్, లాంచీని అందుబాటులో ఉంచారు. పగటిపూట నిమజ్జన ప్రక్రియ సజావుగానే సాగుతున్నా రాత్రి వేళలో లాంచీ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. రాత్రి వేళల్లో కూడా లాంచీ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.


