అశ్వారావుపేటరూరల్: తాకట్టు పెట్టిన తమ బంగారం భద్రంగా ఉందో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అశ్వారావుపేటలోని సీఎస్ బీ బ్యాంక్‌లో కొద్ది నెలలుగా ఓ కిందిస్థాయి ఉద్యో గి... ఒకరి బంగారం మరొకరి పేరుతో తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టేందుకు వచ్చేవారికి నకిలీ రసీదులు ఇచ్చి, ఆ తర్వాత వారికి తెలియకుండా అదే బంగారంపై అదనపు రుణాన్ని పొందడం వంటి ఘటనలు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాదారుల వద్ద ఉన్న రసీదులకు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్న రుణాల వివరాలకు పొంతన లేదు. రుణం రూ.వేలల్లో తీసుకుంటే.., రికార్డుల్లో రూ.లక్షల్లో కనిపిస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం శుక్రవారం వెలుగులోకి రాగా, శనివారం కూడా బాధితులు బ్యాంక్ వద్దకు పెరుగులు పెట్టారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు భద్రత కల్పించారు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు రెడ్డి, ఎస్‌ఐ యయాతీ రాజు బ్యాంక్ ఉద్యోగులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ప్రైవేటు బ్యాంక్ వద్ద బాధితుల ఆందోళన


