● ప్లాస్టిక్ వస్తువుల దాడితో అల్లికలు కనుమరుగు ● కలప సేకరణపై ఆంక్షలు విధిస్తున్న అటవీశాఖ ● వెరసి ఉపాధి కోల్పోతున్న మేదరి కుటుంబాలు
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం
అశ్వాపురం: ఉమ్మడి జిల్లాలో వెదురు కళాకృతుల తయారీకి ప్రత్యేకత ఉండేది. దట్టమైన అటవీ ప్రాంతంలో వెదురు లభిస్తుండటంతో అనేక కళాకృతులను తయారు చేసేవారు. కోళ్లగూళ్లు, చాటలు, ధాన్యం నిలువ చేసే గుమ్మీలు, గంపలు, బతుకమ్మ సిబ్బీలు, తడకలు తదితర వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ మేదరులు జీవనోపాధి పొందేవారు. కాలక్రమేణా ప్రజల జీవన విధానంలో మార్పులు రావడం, అటవీశాఖ అధికారులు వెదురు సేకరించకుండా ఆంక్షలు విధించడంతో వస్తువుల ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు ప్లాస్టిక్, ఆధునిక టెక్నాలజీతో కూడిన వస్తువులు ఇబ్బడిముబ్బడిగా రావడంతో వెదురు వస్తువులకు ఆదరణ తగ్గిపోయింది. అల్లికలు కనుమరుగై ఫలితంగా మేదరులు ఉపాధి కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలో వెదురుతో కళాత్మక వస్తువులు తయారు చేసే కుటుంబాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కొన్నేళ్లుగా వెదురు సేకరణపై ఫారెస్టు అధికారులు ఆంక్షలు విధిస్తుండటంతో ఉపాధి కరువై ఆయా కుటుంబాలవారు వలస కూలీలుగా మారుతున్నారు.
ఆదుకోని ప్రభుత్వాలు
ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేసి కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఉపాధి కల్పిస్తామని పలుమార్లు హామీలు ఇచ్చాయి. కానీ ఆ దిశగా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. తగిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పినా ఆచరణ రూపం దాల్చడంలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెదురు సేకరణపై అటవీశాఖ ఆంక్షలు ఎత్తి వేయాలని, వెదురు వస్తువులు విక్రయించేందుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని పలువురు మేదరులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో అనేక మంది వెదురు వస్తువుల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆదరణ లేక రోడ్డున పడే పరిస్థతి నెలకొంది. మేదరులకు ఫెడరేషన్ ద్వారా ఉపాధి కల్పిస్తామని, రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. కానీ అమలు చేయలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మాకు ఉపాధి కల్పించాలి.
–పెద్ది నాగకృష్ణ,
మేదరి సంఘం నాయకుడు, మణుగూరు


