ఎట్టకేలకు కదలిక! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కదలిక!

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

పురుషోత్తపట్నం రామయ్య భూముల రక్షణకు అధికారుల చర్యలు

కొన్ని అక్రమ నిర్మాణాల తొలగింపు, మిగిలినవి ఖాళీ చేయాలని ఆదేశం

ఆ భూములే భద్రాచల రామాలయ అభివృద్ధికి కీలకం

అక్రమ నిర్మాణాల తొలగింపు

భద్రాచలం: ఏపీలోని పురుషోత్తపట్నం భూముల్లో ఉన్న రామయ్య భూముల రక్షణ విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కొన్నేళ్లుగా రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దీంతో దేవస్థానం సిబ్బంది నిర్మాణాల తొలగింపు చేపట్టగా, ఆక్రమణదారులతో వాగ్వాదాలు జరిగాయి. ఏపీ పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి సరైన సహకారం లేకపోవడంతో దేవస్థానం అధికారులు చింతూరు పీఓ, రంపచోడవరం కలెక్టర్‌, ఇతర జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఐడీడీఏ పీఓ రామాలయ అధికారులకు సహకరించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఇటీవల ఆయా శాఖ ఆధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

అభివృద్ధికి ఆ భూములే దిక్కు

శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 1,350 ఎకరాల భూమి ఉన్నట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో 889 ఎకరాలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉంది. ఇందులో దాదాపు 750 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అనధికార అంచనా. ఇది పోగా మిగిలిన భూమి మాత్రమే ప్రస్తుతం దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కేవలం భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో ఉండి ఇతర ప్రాంతమంతా ఏపీకి వెళ్లిపోయింది. దీంతో దేవస్థానం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు భద్రాచలంలో స్థలం లేకపోవడంతో ఆలయ అభివృద్ధి పనులకు పురుషోత్తపట్నంలోని దేవస్థానం భూములు మాత్రమే దిక్కుగా మారాయి. ఇప్పటికే సుమారు 104 ఎకరాల స్థలంలో గోశాలతోపాటు చెరువు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ఇతర భూములు సైతం దేవస్థానం ఆధ్వర్యంలోకి వస్తే భక్తులకు వసతి, కాటేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో దేవస్థానం వర్గాలు ప్రత్యేక దృష్టి సారించారు. కేవలం అక్రమ నిర్మాణాల తొలగింపుతోనే కాకుండా దేవస్థానం భూములకు సరిహద్దుల నిర్ధారణ, సమగ్ర సర్వే, హద్దుల ఏర్పాటు, రికార్డుల డిజిటలైజేషన్‌, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్‌లో భద్రగిరి అభివృద్ధికి ఈ భూములు కీలకం కానున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించి, భక్తుల అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఏపీ పోలీసు, రెవెన్యూ శాఖల సహాయ సహకారాలతో దేవస్థానం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అక్రమ నిర్మాణాలను బుధవారం తొలగించారు. మిగిలిన నిర్మాణాల విషయంలోనూ ఆలయ ఈఓ దామోదర్‌రావు వారితో చర్చించారు. ఆ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు గడువు కోరగా, ఈ నెల 25వ తేదీ లోపుగా ఖాళీ చేసి స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో యంత్రాల సహాయంతో పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement