భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి రామసేవా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు, పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
ఆర్‌సీహెచ్‌పీని
పరిశీలించిన రైల్వే ఏఓ
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్‌సీహెచ్‌పీ)ని గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే ఏఓ కులకర్ణి సుశాంత్ సుభాష్ సందర్శించారు. సీహెచ్‌పీలో బొగ్గు రవాణాలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోడింగ్, వేయింగ్ వివరాలు ఆరా తీశారు. ఆర్‌సీహెచ్‌పీ ఇన్‌చార్జి లింగా, రైల్వే స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పాష, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు, నిమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు 1,323 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు క్రిబ్‌కో కంపెనీకి చెందిన 1,323 మెట్రిక్ టన్నుల యూరియా గురువారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 523 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 మె.టన్నుల యూరియా సరఫరా చేశారు. మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని ఖమ్మం డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు.
ప్రజాపాలనతో గిరిజనాభివృద్ధి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: ప్రజాపాలనతో గిరిజనాభివృద్ధి సాధ్యమైందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజునే తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, శ్రీ సీతారామ చ్రందస్వామి దేవస్థానం కార్యాలయం ఆవరణలో ఈఓ దామోదర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు ఆనంద కుమార్, చందన, రాంబాబు, అరుణకుమారి, ఉదయ్ కుమార్, భగవాన్ రెడ్డి శ్రావణ్‌కుమార్, భవాని రామకృష్ణ పాల్గొన్నారు.


