భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా గురువారం బీఎస్‌ఐ (ఐఎస్‌ఓ 7101) బృందం తనిఖీలు నిర్వహించింది. బీఎస్‌ఐ సభ్యులు డాక్టర్ శంతను, కల్పన, జిల్లా క్వాలిటీ ఇన్‌చార్జి రాధ పాల్గొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులతో మాట్లాడారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగుల భద్రత, వైద్య సేవల నాణ్యత, అత్యవసర విభాగాల పనితీరు, రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు, ల్యాబ్ సౌకర్యాలు, మందుల నిల్వలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై, వైద్య సేవల నాణ్యతను మరింత పెంచేందుకు లోపాలను అధిగమించేందుకు సూచనలు చేశారు. సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, హెడ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.


