కమర్షియల్‌గా కాజేస్తున్నారు? | - | Sakshi
Sakshi News home page

కమర్షియల్‌గా కాజేస్తున్నారు?

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

సాగు యోగ్యంకాని భూమిలోనే..

వాణిజ్య అవసరాలకు యథేచ్ఛగా

వ్యవసాయ భూముల వినియోగం

రంగాపురం నుంచి పెద్దమ్మగుడి వరకు వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌ హాళ్లు..

1/70 చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో ల్యాండ్‌ కన్వర్షన్‌ చేస్తున్న అధికారులు

విచారణ జరపాలని కోరుతున్న ఆదివాసీ సంఘాల నాయకులు

అధికారులపై చర్యలు తీసుకోవాలి

సర్వే నంబర్లతో ఫిర్యాదు చేస్తే..

పాల్వంచరూరల్‌: ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను చట్టవిరుద్ధంగా కమర్షియల్‌(వాణిజ్య) అవసరాలకు వినియోగిస్తున్నారు. మరికొందరు అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లోనే వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మండల పరిధిలోని రంగాపురం నుంచి పాల్వంచ పట్టణం వరకు బీసీఎం జాతీయ రహదారికి ఇరువైపులా గిరిజన, గిరిజనేతర రైతులు వ్యవసాయ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే కొందరు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయకుండా, కొందరు తప్పుడు మార్గంలో కన్వర్షన్‌ చేయించుకుని కాంప్లెక్స్‌లు నిర్మించి వ్యాపారాలు సాగిస్తున్నారు. నాగారం కాలనీ వద్ద వాహనాల కంపెనీల పేరిట గిరిజనేతరులు భారీ షెడ్లను నిర్మించి వ్యాపారులు నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నవారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

కుంట రూ.10 లక్షలపైనే..

పెద్దమ్మగుడి దగ్గర నుంచి నాగారంకాలనీ వరకు రోడ్డు వెంట ఉన్న భూములకు అధిక డిమాండ్‌ ఉంది. ఎకరాకు రూ.50 నుంచి రూ.70 లక్షలు పలుకుతోంది. నాగారం కాలనీ నుంచి జగన్నాథపురం గ్రామం వరకు ఈ ధరలు ఉంటే, ఇక పెద్దమ్మగుడి వద్ద మాత్రం ఎకరం రూ. కోటికిపైనే పలుకుతోంది. ధరలు పెరగడంతో గిరిజనుల భూములపై అక్రమార్కుల కన్ను పడుతోంది.

1/70 చట్టం ఏం చెబుతోంది..

వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించాలంటే చట్ట ప్రకారం అనుమతులు ఉండాలి. భూమి కొన్నాక నాలా పన్ను చెల్లించి నాన్‌ అగ్రికల్చర్‌గా మార్చుకున్న తర్వాతే ఏ వ్యాపారమైనా చేసేందుకు అవకాశం ఉంటుంది. సదరు భూమి షెడ్యూల్డ్‌ ఏరియా ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ (ఎల్‌టీఆర్‌–1/70) చట్టం ఉల్లంఘన పరిధిలోకి రావడంలేదని అఫిడవిట్‌ సమర్పించాలి. ఒకవేళ ఎల్‌టీఆర్‌ పరిధిలో ఉంటే రెవెన్యూ శాఖ కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వకూడదు. గిరిజనుల మధ్య భూ బదలాయింపు జరిగినా ఐటీడీఏ పీఓ/కలెక్టర్‌ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ చేయకుండా పలువురు గిరిజనేతరులు జాతీయ రహదారి వెంట భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.

మినహాయింపులు ఉన్నా..

ఏజెన్సీలో ఎల్‌టీఆర్‌ చట్టానికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 1970కి ముందు నుంచే భూమి గిరిజనేతరుల చేతిలో ఉండి, రిజిస్ట్రేషన్‌/పట్టా కలిగి ఉంటే ఎల్‌టీఆర్‌ చట్టం వర్తించదని గతంలో న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. ఆ సమయంలో కూడా ఐటీడీఏ, రెవెన్యూ శాఖలు నిశితంగా లింక్‌ డాక్యుమెంట్లతో సహా పరిశీలించాకే అనుమతులు ఇవ్వాలి. తప్పుడు పత్రాలతో వాణిజ్య నిర్మాణాలు చేపడితే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.

వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చుకోవాలంటే అది సాగుకు యోగ్యం కాదని ఆర్డీఓ నిర్ధారించాలి. ఆ తర్వాతనే రియల్‌ వ్యాపారానికి వినియోగించుకోవాలి, ఇందుకోసం ప్రభుత్వానికి సుమారు పదిశాతం మార్కెట్‌ విలువ ధర చెల్లించి అనుమతి పొందాలి. ఈ నిబంధనలు పాటించకుండానే కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. కొందరు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానాలు చేయించుకుని పంటల సాగయ్యే భూములను కాజేస్తున్నారు. వ్యాపార కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసా య భూములను కన్వర్షన్‌ చేయడం నేరం. 1/70 నిబంధనలు ఉల్లంఘించి వ్యవసాయ భూములను కన్వర్షన్‌ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కన్వర్షన్‌ చేయకుండా వాణిజ్య అవసరాలకు వినిగియోగిస్తున్నవారిపైనా చర్యలు చేపట్టాలి. –సోయం సత్యనారాయణ,

ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు

ఏజెన్సీ ప్రాంతంలో 1/70 భూ బదలాయింపు చట్టం ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనులు మాత్రమే క్రయ, విక్రయాలు జరుపుకోవాలి. వ్యవసాయ భూములను కన్వర్షన్‌ చేసే అవకాశం ఉండదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. సర్వే నంబర్ల ఆధారంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. –దారా ప్రసాద్‌, తహసీల్దార్‌, పాల్వంచ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement