● ఐరన్ షాపు యజమాని షాపు, ఇంట్లో ఆకస్మికంగా సోదాలు ● ఐరన్ కొనుగోళ్లలో జీఎస్టీ ఎగవేత.. వ్యాపారి పరారీ!
పాల్వంచ: పాల్వంచలోని ఓ ఐరన్ షాపు యజ మాని షాపులో, ఇంట్లో హైదరాబాద్‌కు చెందిన సీజీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. సెజ్ యూనిట్‌ను ఫోర్జరీ పత్రాలతో ఏర్పా టు చేసుకుని జీరో పర్సంట్ జీఎస్టీతో ఐరన్‌ను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీఎం రోడ్‌లో ఉన్న తిరుమల ఐరన్ షాపు నిర్వాహకుడు దారా రవికిషోర్ షాపులో, నెహ్రూనగర్‌లోని ఇంట్లో ఏకకాలంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్, విజిలెన్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జీఎస్టీ సూపరింటెండెంట్ సౌజన్య ఆధ్వర్యంలో సుమారు పది మంది అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వీరి రాకను గమనించిన సదరు వ్యాపారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు.
జీరో పర్సంట్ జీఎస్టీతో ఐరన్ కొనుగోలు?
సదరు వ్యాపారి ఓ సెజ్ యూనిట్ పేరును ఫోర్జరీ పత్రాలతో సృష్టించి ఓ బడా కంపెనీకి సమర్పించి జీరో పర్సంట్ ట్యాక్స్‌తో ఐరన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. భారీ ఎత్తున ఐరన్‌ను వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలు స్తోంది. ఈ వ్యవహారంపై ఆధారాలతో అధికారులకు ఫిర్యాదులు అందాయి. సుమారు రూ.30 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతతో సరుకు తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో సోదాలు చేపట్టారు. తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


