పిల్లలను ఎలా సాకాలి?
● భార్య గొంతు నులిమి హతమార్చిన వ్యక్తి ● ఇద్దరికీ రెండో వివాహం.. అనుమానంతో హత్య
ఖమ్మంఅర్బన్/ఇల్లెందు: ఇద్దరిదీ రెండో వివాహమే. అయితే, ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నందనే అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. కారులో బయటకు తీసుకెళ్లి హతమార్చిన భర్త.. కారును వదిలేసి పరారు కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
నాలుగు నెలల క్రితమే వివాహం..
ఇల్లెందు మండలం చర్చి రొంపేడుకు చెందిన మేడిపల్లి విద్యాసాగర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యాన మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు జన్మించాక విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న ఇల్లెందు స్టేషన్ బస్తీ వాసి చిన్నబోయిన రేణుక(40)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమెను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న విద్యాసాగర్ ఖమ్మంలో నివాసముంటున్నాడు. ఇటీవల రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గొడవలు జరుగుతుండగా బయటకు వెళ్దామని బుధవారం సాయంత్రం ఆమెను విద్యాసాగర్ కారులో ఎక్కించుకుని ఇల్లెందు వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తుండగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆతర్వాత విషయాన్ని ఇల్లెందులోని తన స్నేహితుడికి ఫోన్‌లో వివరించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ మృతదేహం సహా కారు వదిలేసి పారిపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విద్యాసాగర్ ఫోన్ సిగ్నళ్లు పరిశీలిస్తూ బుధవారం రాత్రి 10–30 గంటల సమయాన ప్రగతి స్కూల్ సమీపాన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.
కారులో నుంచి రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఖమ్మం అర్బన్ పోలీసులు ఆమె తల్లి ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, రేణుక మృతదేహం వద్ద తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. కొంతకాలంగా విద్యాసాగర్‌తో గొడవలు జరుగుతున్నందున ఆయనతో వెళ్లొద్దని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడని ఆరోపించారు. ఆమె మృతితో ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏమిటని రోదించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఇల్లెందులోని ఇంటికి రేణుక మృతదేహాన్ని సాయంత్రం తీసుకురాగా, ప్రేమించిన వ్యక్తి చేతిలో హతం కావడంతో పిల్లలు అనాథలయ్యారంటూ బంధువులు, స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు.


