కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో వివిధ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేపట్టారు. విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. కొత్తగూడెంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నాయకులు నారెడ్ల అరుణ్‌కుమార్, కోలా నవీన్ మాట్లాడుతూ ఐదు రోజుల పనిదినాల విధానం అమలులో జాప్యం చేయొద్దని అన్నారు. బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఉద్యోగులందరికీ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 28 నుంచి మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు స్తంభించి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఏజీఎస్ కె. శ్రీకాంత్, కొత్తగూడెం రీజినల్ సెక్రటరీ కె.అర్జున్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు కె. నిశ్చల్, విద్యా సాగర్, ఎస్బీఐ అవార్డు స్టాఫ్ లీడర్ భవానీ శంకర్, డీసీసీబీ లీడర్ వెంకట కృష్ణ, సందీప్, నాగేంద్ర పాల్గొన్నారు.


