పదేళ్లలో ప్రగతిగిరి! | - | Sakshi
Sakshi News home page

పదేళ్లలో ప్రగతిగిరి!

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

క్రమంగా మారనున్న భద్రగిరి రూపురేఖలు

రెండేళ్లలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం

భద్రాచలం వరకు పట్టాలెక్కుతున్న రైల్వే కనెక్టివిటీ

ఎయిర్‌పోర్టు, అంతర్రాష్ట్ర డిపో వస్తే మరింత అభివృద్ధి

ఎయిరుపోర్టు వస్తే దేశ, విదేశాల నుంచి భక్తులు

జిల్లాకు విమానాన్ని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చితే ఏజెన్సీ కేంద్రం అత్యంత వేగంగా ప్రగతి పథంలో పయనించనుంది. విమానాశ్రయ ఏర్పాటుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందం ఇటీవల రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించింది. జిల్లాలో ఐదు ప్రాంతాలను పరిశీలించగా, అందులో దుమ్ముగూడెం మండలంలోని పెద్ద ఆర్లగూడెం, పెద్ద కమలాపురం పరిసర ప్రాంతం కూడా ఉంది. సుమారు 671 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి అందుబాటులో ఉండటం, పెద్ద గుట్టలు లేకపోవడం, భూ పరీక్షలో మట్టి బాగుండటం వంటివి కలిసొచ్చే అంశాలుగా ఉన్నట్లు సమాచారం. దీనిని ప్రతిపాదిస్తే నేరుగా భద్రాచలానికి విమాన రాకపోకలు ఉంటాయి. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు వచ్చినా భద్రాచలానికి దేశ, విదేశాల నుంచి విమానం ద్వారా భక్తులు చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

రైల్వే లైన్‌ ఏర్పాటుకు సుముఖత

భద్రాచలం వరకు నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని భక్తులు ఏళ్ల నుంచి కోరుతున్నారు. కొత్తగూడెం వరకు రైల్వే సదుపాయం ఉండగా, అక్కడ నుంచి భద్రాచలం వరకు రోడ్డు మార్గంలో రావాల్సి వస్తోంది. పాండురంగాపురం– మల్కాన్‌గిరి రైల్వే లైన్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, ఇందులో తొలి దశలోనే పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే కనెక్టివిటీ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో ఇటీవలే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైల్వే లైన్‌ పూర్తయితే దేశంలోని పలు ప్రాంతాల నుంచి రైల్వే ద్వారా భద్రాచలానికి నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది.

అంతర్రాష్ట్ర డిపో కూడా వస్తే..

ప్రస్తుతం భద్రాచలానికి భక్తులు ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారానే వస్తున్నారు. భద్రాచలం భౌగోళికంగా తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఉంది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర బస్సు డిపో ఏర్పాటు చేస్తే భద్రాచలానికి మరింత రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు నేరుగా బస్సు సర్వీసులు పెరిగితే భద్రగిరి రవాణా హబ్‌గా మారనుంది. తద్వారా ప్రయాణం సులభమవుతుంది.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భద్రాచలం వరకు రైల్వే మార్గం కూడా సుగమమైంది. జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, భద్రాచలంలో అంతర్రాష్ట్ర ఆర్టీసీ డిపో ఏర్పాటైతే మరింత అభివృద్ధి సాధించనుంది. రోడ్డు, రైల్వే, వాయు మార్గాల్లో రాకపోకలు అందుబాటులోకి వస్తే విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్యా పెరగనుంది.

– భద్రాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement