నోటీసులొస్తే కంగారు పడొద్దు | - | Sakshi
Sakshi News home page

నోటీసులొస్తే కంగారు పడొద్దు

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

ఓటర్ల సందేహాలకు సమాధానాలు

‘సాక్షి’ఫోన్‌ ఇన్‌లో ఎన్నికల విభాగం అధికారి రంగా ప్రసాద్‌

చుంచుపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులపై నెలకొన్న సందేహాలను జిల్లా ఎన్నికల విభాగం అధికారి రంగా ప్రసాద్‌ నివృత్తి చేశారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, 2002 నాటి ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు, ఎన్యుమరేషన్‌ ఫారాలు, ఓటు ఉందో లేదో తెలుసుకునే విధానం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. జిల్లాలో అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ ఓటర్లు 2,40,438 మంది ఉండగా, వారిలో ఇప్పటి వరకు 1,77,790 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 18,076 మంది ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు లేదా పాత ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో తేడాలు ఉన్నంత మాత్రాన ఓటు తొలగిపోదని, నిబంధనల ప్రకారం వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. నోటీసులు అందినంత మాత్రాన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో పేర్కొన్న తేదీలో సంబంధిత బీఎల్‌ఓను కలిసి అందుబాటులో ఉన్న ఆధారాలను సమర్పించాలని సూచించారు.

ప్రశ్న: నా పేరు, మా అమ్మ పేరు తప్పుగా ఉందని నోటీసులు వచ్చాయి. మేము ఏ ఆధారాలు ఇవ్వాలి?

– బాసాని ఉమాదేవి, కొత్తగూడెం

జవాబు: నోటీసులో సూచించిన తేదీలో బీఎల్‌ఓకు కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్‌లను సమర్పించాలి.

ప్రశ్న: నా పేరు సయ్యద్‌ జానీ హుస్సేన్‌ కాగా జానీ సయ్యద్‌గా నమోదైంది. నోటీసు ఇచ్చారు. ఎలా సవరించుకోవాలి..?

– సయ్యద్‌ జానీ హుస్సేన్‌, హనుమాన్‌ బస్తీ

జవాబు: పదో తరగతి టీసీ, మెమో, కుల ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాల్లో ఏవైనా రెండు జిరాక్స్‌ ప్రతులను బీఎల్‌ఓకు అందజేయండి.

ప్రశ్న: మా నాన్న పేరు తప్పుగా నమోదైందని నోటీసు వచ్చింది. ఏం చేయాలి..?

– షేక్‌ పర్వేజ్‌ ఆలం, బూడిదగడ్డ

జవాబు: మీ వద్ద ఉన్న సరైన ధ్రువీకరణ పత్రాలను బీఎల్‌ఓకు సమర్పించండి.

ప్రశ్న: 2002 జాబితాలో ఉన్న తండ్రి పేరుకు, ప్రస్తుతం నమోదైన పేరుకు తేడా ఉందని నోటీసు ఇచ్చారు?

– వెంకటవీరయ్యచారి, పాత కొత్తగూడెం

జవాబు: కేటాయించిన తేదీలో బ్యాంకు పాస్‌బుక్‌, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో వంటి ఆధారాల్లో ఏవైనా రెండు సమర్పించాలి.

ప్రశ్న: 2002లో మేం ఇక్కడ లేం. మా తాత ఇక్కడే ఉండటంతో ఆయన ఆధారాలతో ఎన్యుమరేషన్‌ వివరాలు ఇచ్చాం. తప్పులు ఉన్నాయని ఇప్పుడు నోటీసులు వచ్చాయి. ఏం చేయాలి..?

– రామకృష్ణ, అశ్వాపురం

జవాబు: 2002లో స్థానికంగా లేకపోవడంతో ప్రస్తుత వివరాలను నమోదు చేసిన కారణంగా నోటీసు వచ్చి ఉండవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఇద్దరివి రెండు చొప్పున ఆధారాలను బీఎల్‌ఓకు సమర్పించాలి.

ప్రశ్న: తండ్రి పేరు వ్యత్యాసంతో నోటీసు వచ్చింది. నా ఓటు ఉంటుందా? పోతుందా..?

– కవులురి పోలయ్య, దమ్మపేట

జవాబు: 2002, ఇప్పటి జాబితాల్లోని తండ్రి పేర్లలో తేడా ఉండటంతో నోటీసు ఇచ్చి ఉండవచ్చు. నోటీసులో పేర్కొన్న తేదీలో ఎన్నికల సంఘం సూచించిన 11 ఆధారాల్లో ఏవైనా రెండు సమర్పించాలి.

ప్రశ్న: నా భార్యకు, నాకు సంబంధించిన ఇద్దరి ఓటు వివరాల్లో తేడాలు ఉన్నాయని ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.?

– దుర్గాప్రసాద్‌, భద్రాచలం

జవాబు: 2002 నాటి డేటా మ్యాపింగ్‌లో తేడాలు ఉండే అవకాశం ఉంది. స్టడీ సర్టిఫికెట్లు, కుల లేదా నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా రెండు ఆధారాలను బీఎల్‌ఓకు సమర్పించాలి.

ప్రశ్న: ఓటరు జాబితాలో నా ఇంటిపేరు స్థానంలో భర్త ఇంటిపేరు నమోదైందని నోటీసు వచ్చింది. ఏం చేయాలి..?

– శైలజ, పాల్వంచ

జవాబు: ఇంటిపేరు విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సవరణకు అవకాశం ఉంది. స్టడీ సర్టిఫికెట్‌, టీసీ, పదో తరగతి మెమో వంటివి, లేక ఇతర ఆధారాలను బీఎల్‌ఎకు సమర్పించాలి.

ప్రశ్న: మా తండ్రి సింగరేణిలో పనిచేశారు. అప్పట్లో ఇంటిపేరు చిక్కుడు అని తప్పుగా నమోదైంది. ఇప్పుడు నోటీసు వచ్చింది. ఏం చేయాలి..?

– కృష్ణచైతన్య, ఇల్లెందు

జవాబు: ఇంటిపేరు తప్పుగా నమోదైతే ఆధారాలతో మళ్లీ సవరించుకోవచ్చు. కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు లేదా పదో తరగతి మార్కుల మెమో వంటి రెండు సరైన ఆధారాలను ఎన్నికల సిబ్బందికి సమర్పించాలి.

ప్రశ్న: 2002 మ్యాపింగ్‌లో ఇంటిపేరు తేడా వచ్చింది. ఇప్పటికే పాస్‌పోర్టును ఆధారంగా సమర్పించాం. మరో ఆధారం అవసరమా..?

– ప్రేమ్‌సాయి, పాల్వంచ

జవాబు: వీలుంటే పదో తరగతి మార్కుల మెమో లేదా నివాస ధ్రువీకరణ పత్రం వంటి మరో ఆధారాన్ని కూడా బీఎల్‌ఓకు అందజేయండి.

ప్రశ్న: కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాలో నా ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..?

– రేష్మ తస్లీమ్‌, చండ్రుగొండ

జవాబు: సమీప బూత్‌ లెవల్‌ అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్‌ చేసి మీ ఈపిక్‌ నంబర్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్న: ఒక కుటుంబం 1997కు ముందు వాజేడు–వెంకటాపురంలో ఉండేది. 1993లో మణుగూరులో ఉండి ఓటేశారు. 2003లో పాల్వంచకు వచ్చిన తర్వాత ఓటు వేయలేదు. దరఖాస్తులు ఇచ్చినా జాబితాలో పేర్లు రాలేదు. ఏం చేయాలి..?

– మసూద్‌, పాల్వంచ

జవాబు: వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సమయంలో ఓటు వివరాలు నమోదై ఉండటం, అనంతరం మ్యాపింగ్‌ కాకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. 1987కు ముందు నాటి ఆధారాలు ఏమైనా ఉంటే సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే వారి పిల్లల వివరాలను కూడా ఇవ్వాలి.

ప్రశ్న: ఎస్‌ఐఆర్‌లో కొంతమందికి నోటీసులు వచ్చాయి. మరికొందరికి రాలేదు. మాకు నోటీసు రాలేదు. మా ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..?

– గొర్రె బాబూరావు, రామవరం

జవాబు: సాధారణంగా పేరు, వివరాల్లో వ్యత్యాసం లేదా మ్యాపింగ్‌ సమస్యలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మీకు ఎలాంటి నోటీసు రాకపోతే ప్రస్తుత పరిశీలనలో మీ ఓటు జాబితాలో ఉన్నట్లు భావించవచ్చును.

ప్రశ్న: పేరు తప్పుగా నమోదైందని బీఎల్‌ఓ నోటీసు ఇచ్చారు. ఏం చేయాలి..?

– ఈసంశెట్టి రాము, బసవతారకం కాలనీ,

పాల్వంచ

జవాబు: చదువుకున్నట్లయితే స్టడీ సర్టిఫికెట్లు, కుల లేదా నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి,రెండు తీసుకుని నోటీసులో పేర్కొన్న తేదీలో బీఎల్‌ఓను సంప్రదించాలి.

ప్రశ్న: ఎన్యుమరేషన్‌ ఫారాలు సక్రమంగా నింపాం. అయినా మా అన్నదమ్ములకు నోటీసులు వచ్చాయి. ఎందుకు..?

– దొండ నర్సింహరావు, బేతంపూడి

జవాబు: వివరాల పరిశీలనలో కొన్ని అంశాల్లో వ్యత్యాసాలు కనిపించినప్పుడు నోటీసులు జారీ చేస్తారు. అన్నదమ్ముల వయసులో తొమ్మిది నెలల కంటే తక్కువ వ్యవధి వంటి అంశాలపై సందేహాలు ఉంటే ఆధారాలు కోరవచ్చు. ఇందుకు నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను బీఎల్‌ఓకు సమర్పించవచ్చు.

ఆధారాలతో బీఎల్‌ఓను సంప్రదించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement