ఎక్కడ అనుకూలం? | - | Sakshi
Sakshi News home page

ఎక్కడ అనుకూలం?

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

జిల్లా అభివృద్ధికి దోహదం

గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన

రెండు రోజుల పర్యటకు జిల్లాకు

వచ్చిన ఏఏఐ బృందం

తొలిరోజు ప్రతిపాదిత స్థలాల సందర్శన, సాంకేతిక అంశాలపై అధ్యయనం

ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్‌ అంకిత్‌తో సమావేశమై పలు అంశాల చర్చ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది. గతంలో పరిశీలించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఆరు ప్రత్యామ్నాయ ప్రాంతాలపై కేంద్ర సాంకేతిక బృందం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. జిల్లాలో రెండు రోజులు పర్యటించనుండగా, సోమవారంమొదటిరోజు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. సుజాతనగర్‌ మండలంలోని సీతంపేట, గరీబ్‌పేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం ప్రాంతాలను పరిశీ లించింది. ఏఏఐ సభ్యుడు భరత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం భూమి లభ్యత, స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే ఏర్పాటుకు అనుకూలత, విమానాల రాకపోకలకు అవసరమైన అప్రోచ్‌ ఫన్నెల్‌, నైట్‌ ల్యాండింగ్‌, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధ్యయనం చేసింది.

ఎంపీ, కలెక్టర్‌తో సమావేశం

అనంతరం సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్‌ అంకిత్‌తో సమావేశమైంది. ప్రతిపాదిత విమానాశ్ర య ఏర్పాటు అంశాలపై చర్చించింది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, ఏటీఆర్‌–72 తరహా విమానాలతోపాటు పెద్ద ఎయిర్‌బస్‌ ఏ320/ఏ321 విమానాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా సుమారు 2,500 నుంచి 2,700 మీటర్ల రన్‌వేకు అవసరమయ్యే అవకాశాలను పరిశీలించింది. ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న విద్యుదీకరించిన బొగ్గు రవాణా, రైల్వే లైన్‌ కూడా సాంకేతిక బృందం పరిశీలనలో ప్రధాన అంశంగా నిలిచింది. రైల్వే మార్గం విమానాల అప్రోచ్‌ ఫన్నెల్‌ పరిధిలోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో దాని వల్ల ఏర్పడే సాంకేతిక ప్రభావాలను పరిశీలిస్తున్నారు. రైల్వే శాఖ నుంచి అవసరమైన ఎన్‌ఓసీ పొందే అంశంపై చర్యలు చేపట్టనున్నారు. విమానయాన సదుపాయం సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం ఏర్పాటు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధితోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ పరిశీలనకు అవసరమైన రెవెన్యూ, సర్వే, సాంకేతిక సమాచారాన్ని సిద్ధంగా ఉంచామని అన్నారు. కాగా, మంగళవారం దుమ్ముగూడెం, పాల్వంచ మండలాల్లో ప్రతిపాదిత స్థలాలను పరిశీలించనున్నారు. అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ పర్యటనలో సంబంధిత రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్‌, ఇతర శాఖల అధికారులు, ఏఏఐ సాంకేతిక ప్రతినిధులు కొత్తగూడెం మేయర్‌ గణేష్‌ పాల్గొన్నారు. కాగా, బృందం వెంట ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్‌ పాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే కూనంనేని కృషితో ఎయిర్‌పోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement