రంగనాయకుల గుట్టకు
విగ్రహాల తరలింపు
భద్రగిరిలో కొనసాగుతున్న
రామాలయ పునరుద్ధరణ పనులు
భద్రాచలం: భద్రగిరిలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు ఊపందుకున్నా యి. ఉపాలయమైన తూర్పు దిక్కున ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కూల్చి, మూలమూర్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవా రం ఆలయ జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ముందుగా ఆదివారం రాత్రి అంకురార్పణ చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణలు, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఆంజనే య స్వామి విగ్రహాలను రంగనాయకుల గుట్టపైకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విగ్రహాల తరలింపునకు సంబంధించిన క్రతువులను ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు స్వామివారి విగ్రహాలను గుట్టపై ఉంచి నిత్యపూజలు జరపనున్నారు.
వరుసగా పరివార ఆలయాల పునరుద్ధరణ
ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే లక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవారు, ఇతర ఆళ్వార్లు మూలమూర్తులకు జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలు జరిపారు. ప్లాన్‌లో ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా చేర్చడంతో సోమవారం తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ప్రధానాలయంలోని మూలమూర్తులు మినహా అన్ని ఉపాలయాల తొలగింపు పూర్తయ్యాయి. విస్తా కాంప్లెక్స్ తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం పూర్తి చేసేలా పనులు చేపడుతున్నారు.
ఘనంగా సీతారాముల నిత్యకల్యాణం
దేవస్థానంలో సోమవారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.


