భద్రాచలం: శ్రీ సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించనున్న ట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ తెలిపారు. గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా అంబసత్రం సమీపంలోని దేవస్థానం సంస్కృత పాఠశాల స్థలంలో జీ+1 విధానంలో డార్మెటరీ హాల్ నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రూ.1.50కోట్లతో డార్మెటరీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు బస, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడు తూ గోదావరి పుష్కరాల దృష్ట్యా అభివృద్ది పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత దేవస్థాన పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కే. దామోదర్‌రావు, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూ ర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
నయనానందకరంగా నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని కరకట్ట వద్ద ఆదివారం గోదావరి మాతకు నిర్వహించిన నదీహారతి నయనానందకరంగా సాగింది. గణపతి పూజ, శ్రీ సీతారామచంద్రస్వామి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్


