కొబ్బరి బోర్డు ఏర్పాటయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి బోర్డు ఏర్పాటయ్యేనా?

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

ప్రాంతీయ కార్యాలయంలేక

నష్టపోతున్న రైతులు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే

అధికంగా కొబ్బరి సాగు

ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి విన్నవించిన మంత్రి తుమ్మల

దమ్మపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు తరలిపోయింది. దీంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 4,366 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో జిల్లాలోనే అత్యధికంగా 2,800 ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు స్థిర ఆదాయం ఇచ్చే పంట కావడం, జీవిత కాలం 60 ఏళ్ల వరకు ఉండటంతో క్రమంగా సాగు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది.

విజయవాడకు తరలిన

ప్రాంతీయ కార్యాలయం

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో కేరళలోని కొచ్చిలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఉండగా, దేశవ్యాప్తంగా 9 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌లో ఉండేది. ప్రాంతీయ కార్యాలయం విజయవాడకు తరలిపోగా, ప్రస్తుతం కొబ్బరి సాగులో సమస్యలు ఉత్పన్నమైతే, రైతులు సలహాల కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి బోర్డు ఏర్పాటుకు చొరవచూపారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను ఈ నెల 2న కలిసి విజ్ఞప్తి చేశారు. పామాయిల్‌ పరిశోధన కేంద్రం మంజూరు చేయాలని, ఆయిల్‌ పామ్‌కు టన్నుకు రూ.25,000 కనీస మద్దతు ధర ప్రకటించాలని కూడా కోరారు. బోర్డు మంజూరైతే కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేటలలో ఏదేని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఏకై క ప్రభుత్వ కొబ్బరి నర్సరీ అశ్వారావుపేట మండల పరిధిలోనే ఉండగా, ఏటా లక్షకు పైగా మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి.

ఇవీ ప్రయోజనాలు

● మొక్కలు, ల్యాబ్‌, శిక్షణ, మార్కెటింగ్‌ వంటి అవకాశాలు లభిస్తాయి.

● అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన వంగడాల అభివృద్ధి

● పంట సాగుకు ప్రోత్సాహకంగా సబ్సిడీ, బీమా సౌకర్యం

● తెగుళ్ల నివారణకు సమీపంలోనే ఉచిత సాంకేతిక సలహాలు

● కొబ్బరి నూనె, పాలు, పీచు, తాడు పరిశ్రమలు వల్ల ఉపాధి అవకాశాలు

● విలువ ఆధారిత పరిశ్రమలకు రాయితీ, మార్కెటింగ్‌ సులభతరం, అంతర్జాతీయ ఎగుమతులు

పామాయిల్‌ పరిశోధన కేంద్రం కూడా..

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పంట సాగు చేస్తున్నారు. ఏటా 40 వేల ఎకరాల సాగు పెరుగుతోంది. జిల్లాలోనే 95 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దేశంలోనే ఏకై క జాతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన సంస్థ(ఐఐఓపీఆర్‌) ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగిలో ఉంది. దీంతో పామాయిల్‌ సాగులో ఎదురయ్యే సవాళ్లకు తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ యాజమాన్యం ఏపీపై ఆధారపడాల్సివస్తోంది. ఇక్కడి రైతులకు మేలు జరగాలంటే స్థానికంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement