ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వ పాలన తీరుతో ప్రజా హక్కులకు విఘాతం కలుగుతున్నందున రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పౌరహక్కుల సంఘం(సీఎల్‌సీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఎన్.నారా యణ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు చైతన్యవంతమైన ఉద్యమాలు అవసరమని తెలిపారు. ఖమ్మంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో సీఎల్‌సీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్.ఉపేందర్ అధ్యక్షతన బుధవారం పౌర హక్కు ల సంఘం 18వ మహాసభ నిర్వహించారు. ఈ సభలో లక్ష్మణ్, నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులను ఇచ్చిందని, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని తెలిపారు. అయితే పాలకుల ప్రజావ్యతిరేక విధానాలతో భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు తీవ్ర ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సభలో సీఎల్‌సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రవి, రాష్ట్ర కోశాధికారి పి.విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎల్‌సీ మహాసభలో
ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ


