● జాన్వీ, సందీప్ రెడ్డి, వేణుగోపాల్, ప్రణయ్ రెడ్డి, సుమంత్ ప్రభాస్, అనంతిక
‘‘రోమాంచకం’ కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. సినిమా కూడా చూశాను... చాలా బాగుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’’ అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలన్నిటికీ ‘ఎ’ సర్టిఫికెట్స్ వచ్చేవి. రాబోయే ‘స్పిరిట్’ మూవీకి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుంది. అయితే తొలిసారి మా బ్యానర్‌లో రూపొందిన ‘రోమాంచకం’ మూవీకి క్లీన్ ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. ఈ సినిమాకు కుటుంబంతో పాటు రండి’’ అని కోరారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్... ఇలా ఎవరితో చూసినా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ నిరుత్సాహపడరు’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో తెలియాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్‌కు రండి’’ అని అనంతిక సనీల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ వేడుకలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కెమెరామేన్ పవన్ పప్పుల, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, నటుడు వెంకటేష్ కాకుమాను మాట్లాడారు.
– సందీప్ రెడ్డి వంగా


