● అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లా రైతులకు సీతారామ సాగునీరు ● భద్రాచలం, కిన్నెరసానిల్లో పర్యాటక అభివృద్ధి ● స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా ప్రభుత్వంలో జిల్లా అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రగతి మైదానంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓపెన్‌టాప్ జీపులో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్‌శ్రేష్ఠతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా చరిత్ర ప్రకృతి, పోరాటం, పరిశ్రమల సమ్మేళనమని అన్నారు.
ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు
సీతారామ ఎత్తిపోతల పథకం ఏన్కూర్ లింక్ కెనా ల్ ద్వారా లక్షా 11 వేల 818 ఎకరాల నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు అందించామని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా గోదావరి జలాలను ఉభయ జిల్లాల రైతులకు సాగునీరు అందించామని అన్నారు. ఉభయ జిల్లాల్లో లక్షా 57 వేల 574 ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 42 వేల 935 ఎకరాలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నామని, సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన పనులను ముందుకు తీసుకెళ్తామని వివరించారు.
గోదావరి కరకట్ట పనుల
విస్తరణ..
గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడేందుకు కరకట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. పాండురంగాపురం నుంచి మల్కన్‌గిరి వరకు రైల్వే లైన్‌లో సారపాక వరకు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా సంబంధిత సంస్థల సూచనలకు అనుగుణంగా భూసేకరణ తదితర చర్యలు చేపడుతున్నామన్నారు. భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వంటి ప్రాంతాలను కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని తెలిపారు. సింగరేణి విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.
రూ.455.33 కోట్ల రుణ మాఫీ
63వేల 614 మంది రైతులకు రూ 455.33 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. ఆయిల్‌పామ్, కోకో పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళలు ఇప్పటివరకు 5 కోట్ల 44 లక్షల ఉచిత ప్రయాణాలు జరిగాయని వివరించారు. 19 వేల 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రూ.230 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, గుండాల ప్రాంతాల్లో నాలుగు కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అదనపు కలెక్టర్ డీ వేణుగోపాలరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
జెండా పండుగ అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. వారితో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
వృద్ధురాలి దేశభక్తి
కొత్తగూడెం నగరంలోని 5వ డివిజన్ నెహ్రు బస్తీకి చెందిన 93 ఏళ్ల వృద్ధురాలు గుండ్లపల్లి తులశమ్మ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. ఏటా వేడుకలకు హాజరవుతున్న ఆమె పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.


