కరకగూడెం: మండల వ్యాప్తంగా శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహం కనిపించలేదు. మండల పరిషత్ కార్యాలయంలో కనీసం జెండాల తోరణాలు కూడా కట్టలేదు. జెండా ఎగరేసే గద్దెకు కనీసం రంగులు వేయలేదు. సరైన జెండా కర్ర కూడా లేకుండా ఒక తెల్లటి పైపునకు జాతీయ జెండాను కట్టి ఎగురవేశారు. అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రభుత్వ శాఖల అధికారులు తమ కార్యాలయాల వద్ద జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని రగిలించేలా కనీసం ఒక్క నిమిషం పాటు కూడా ప్రసంగించకపోవడం గమనార్హం.
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
పంద్రాగస్టు సాక్షిగా గిరిజన రైతుల దీక్ష
మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే తాటి, బీఆర్‌ఎస్ నాయకులు
అశ్వారావుపేటరూరల్: స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా గిరిజన రైతులు తమ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ శనివారం నిరవధిక దీక్ష చేపట్టారు. మండలంలోని వేదాంతపురం రెవెన్యూ పరిధిలో సుమారు ఐదు దశాబ్దాలుగా సన్న, చిన్నకారు గిరిజన రైతులు రెవెన్యూ భూముల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఆ భూములకు హక్కు పత్రాలు నేటికీ రాలేదు. దీంతో బాధిత రైతులంతా గ్రామంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాక నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సర్వే నంబర్లు 122, 33, 37లలో సుమారు 426 ఎకరాల్లో 150 మంది రైతులు తరతరాలుగా పంటలను సాగు చేసుకుంటుండగా, అటవీ శాఖ అధికారులు ఏటా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఎన్నోసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. తమకు హక్కు పత్రాలు ఇచ్చేదాకా దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సర్పంచ్ తోట వెంకటమ్మ, ఉప సర్పంచ్ సంగీతం వీర్రాజు, మాజీ సర్పంచ్ సోని శివ ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
కొత్తగూడెంఅర్బన్: అర్హులకు ప్రభుత్వ ఉచిత సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనర్హులు ఆహార భద్ర త కార్డులను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని కోరా రు. కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు రూ.420 కోట్లు మంజూరు చేశామని, నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందుతాయని అన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 3,14,308 లామినేటెడ్ స్మార్ట్ పీడీఎస్ రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో 86,001, పినపాకలో 76,321, భద్రాచలంలో 41,291, అశ్వారావుపేటలో 65,484, ఇల్లెందులో 45,211 స్మార్ట్ పీడీఎస్ రేషన్ కార్డులు జారీ చేసినట్లు వివరించారు. చెరువుల్లో గతేడాదితో పోలిస్తే 50 శాతం తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని, రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను పండించాలని అన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మేయర్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, అధికా రులు పాల్గొన్నారు.


