దమ్మపేట: దైవ దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న బాలుడు అనంతలోకాలకు వెళ్లిన ఘటన మండల పరిధిలోని పట్వారిగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... భద్రాచలానికి చెందిన దాసరి వెంకన్నబాబు తన కుటుంబంతో ద్వారకా తిరుమల దర్శనానికి ఆటోలో బయలుదేరాడు. ఆటో నడుపుతున్న వెంకన్నబాబు పట్వారిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో పక్కకు నిలిపాడు. కిరాణా సరుకుల నిమిత్తం రోడ్డు దాటుతుండగా అతడి వెంటే పెద్ద కుమారుడు పవన్‌సాయి(10) వెళ్తున్నాడు. అదే సమయంలో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్న కారు ఢీకొని బాలుడి మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌కుమార్ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చర్ల: మండలంలోని వీరాపురం సమీపంలో గోదా వరి నదితీరంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమా రు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో శవ పంచనామా అనంతరం స్థానికుల సహకారంతో అక్కడే ఖననం చేయించినట్లు ఎస్సై నర్సిరెడ్డి తెలిపారు.
బెదిరింపులపై కేసు నమోదు
దమ్మపేట: ఏజెన్సీ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారనే కారణంగా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన ఓ పత్రికా విలేకరి(సాక్షి కాదు)పై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశా రు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన దారా మల్లేశ్వరి ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ఈ నెపంతో దమ్మపేట మండలానికి చెందిన ఓ విలేకరి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజ నేతరులు ఎలా భూములు కొనుగోలు చేస్తారంటూ ఆమె ను బెదిరించాడు. రూ.2లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో పాస్‌బుక్‌ను రద్దు చేయిస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆమె ఫోన్ పే ద్వారా రూ.50,000 చెల్లించింది. రూ. 2లక్షలు ఇవ్వాల్సిందేనని బెదిరింపులు కొనసాగించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విలేకరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేష్‌కుమార్ తెలిపారు.
ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్
అశ్వారావుపేటరూరల్: వాగుల్లో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్టు రేంజర్ మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అనంతా రం, గాండ్లగూడెం, నెమలిపేట గ్రామాల శివారులో పెదవాగు నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలోని రామన్నగూడెం టేకు ప్లాంటేషన్ వద్ద ఆరు ట్రాక్టర్లను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు.
కోడి పందేల స్థావరంపై దాడి
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలు, రూ.2100 నగదు, గాయపడిన పందెం కోడి పుంజును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశామని, మరికొందరు పారిపోయారని తెలిపారు.
న్యూడెమోక్రసీలో చేరిక
మణుగూరు రూరల్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ యతీంద్రకుమార్(వైకే)వర్గం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు దుబ్బాక రామయ్య(జగ్గన్న), ఆయన సతీమణి ప్రమీల శుక్రవారం న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీలో చేరారు. వీరిని ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్, జిల్లా నాయకుడు సింగబోయిన రామన్న పార్టీలోకి ఆహ్వానించారు.


