● ఆగస్టు 15న తుమ్మల చెరువు నింపుతామని మంత్రుల హామీ ● పూర్తికాని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు ● నేడు లిఫ్ట్ డ్రై రన్‌కు హాజరుకానున్న మంత్రి తుమ్మల
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరు పంప్‌హౌస్ సమీపంలో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ఈ నెల 15న తుమ్మలచెరువుకు అందుతాయనుకున్న ఆయకట్టు రైతులకు నిరాశే మిగిలింది. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ నెల 15న తుమ్మలచెరువుకు నీరు వదులుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరా వు, ఉత్తమ్‌కుమార్ ఇచ్చిన హామీ అమల య్యే పరిస్థితి లేదు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం జరుగుతోంది. పంపు, మోటరు అమర్చినా ఎత్తిపోతల పథకం నుంచి గొందిగూడెం వైపు ఇసుకవాగు ద్వారా గోదావరి జలా లను తుమ్మలచెరువుకు తరలించేందుకు చేపట్టిన పైపులైన్ పనుల్లో ఆలస్యమవుతోంది. ఇందుకోసం సుమారు 2.5 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. దీంతో ఈ నెల 15న తుమ్మలచెరువుకు గోదావరి జలాలు వస్తే వరినాట్లు వేసుకోవచ్చని ఎదురుచూసిన రైతులు నిరాశ చెందుతున్నారు. 8వేల ఎకరాల్లో వరిసాగుకు సిద్ధమైన రైతులు వరిసాగుపై సందిగ్ధంలో పడ్డారు. వరినార్లు పోసి నెల రోజులు గడిచింది. నారు ముదిరితే వరి పంటలో దిగుబడి తగ్గుతుంది. మంత్రులు, అధికారులు స్పందించి వారం రోజుల్లో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కాగా శనివా రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను సందర్శించి మోటార్ల డ్రై రన్ చేపట్టనున్నారు.


