చలాన్లు కాదు.. ప్రాణాలే ముఖ్యం
బైక్‌పై వెళ్తూ హెల్మెట్ లేకుంటే చలానా
లారీలు, ఇతర భారీ వాహనాలపై నిఘా కరువు
ప్రమాదం తర్వాత కేసులు తప్ప
ముందస్తు తనిఖీలు అంతంతే
భద్రాచలంఅర్బన్: రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే చలానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా పోలీసులు, రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మరి అదే రహదారిపై భారీ లోడ్‌తో ప్రమాదకరంగా దూసుకెళ్లే లారీలు, టిప్పర్లు, ఇతర సరకు రవాణా వాహనాల విషయంలో మాత్రం అధికారులు తీసుకుంటున్న చర్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస ప్రమాదాలు జరుగుతున్నా...
● భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు లారీలు, ఇతర భారీ వాహనాల ప్రమేయంతో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 14న బూర్గంపాడు మండలం సారపాక ప్రాంతంలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఏన్కూర్ మండలానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ వెంగళరావు మృతి చెందాడు.
● జూన్ 19న భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
● జూలై 14న జూలూరుపాడులో యాష్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
● అదేనెల 15న బూర్గంపాడు మండల పరిధిలో గల కృష్ణసాగర్ క్రాస్‌రోడ్డు వద్ద పాల్వంచ మండల కేశవాపురం గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కిశోర్ కుమార్ లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు.
● అలాగే, 17న ఐటీసీ లారీ యార్డులో జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సూర్యచందర్‌రావు మృతి చెందాడు.
● జూలై 27న దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు.
● ఈనెల 7న సారపాక ఐటీసీ వద్ద డ్యూటీని ముగించుకుని శ్రీరామ్ మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు.
● ఈ ఘటనలు వేర్వేరు కారణాలతో జరిగినవే అయినా భారీ వాహనాల ప్రమేయంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నందున రోడ్డు భద్రతపై సమగ్ర సమీక్ష అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
చర్యలు ఉన్నాయా?
ద్విచక్ర వాహనదారులపై హెల్మెట్ తనిఖీలు, చలాన్లు విధించడం అవసరమే. అయితే రోడ్డు భద్రతను బైక్‌లకే పరిమితం చేయకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్తున్నారా, ఓవర్‌లోడ్ చేస్తున్నారా, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్ ఉందా అనే తదితర అంశాలపై నిరంతర తనిఖీలు అవసరం. ముఖ్యంగా రాత్రివేళ నిఘా పెంచి డ్రంక్ అండ్ డ్రైవ్, నిద్రమత్తులో డ్రైవింగ్ వంటి అంశాలపై తనిఖీలు చేపట్టాలి. డ్రైవర్లు ఎక్కువ గంటలు విశ్రాంతి లేకుండా వాహనాలు నడుపుతున్నారా అనేది కూడా పరిశీలించాలి.
ముందస్తు చర్యలతోనే ఫలితం
ప్రమాదం జరిగిన తర్వాత కేసు నమోదు చేయడ, వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం చట్టపరమైన ప్రక్రియ. కానీ ప్రమాదం జరగకముందే స్పందించడమే రోడ్డు భద్రతకు కొలమానం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పోలీసులు, రవాణా, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి.
రోడ్డు భద్రత అంటే చలాన్ల సంఖ్య పెంచడం కాదు.. ప్రమాదాల సంఖ్య తగ్గించడం. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న భారీ వాహన ప్రమాదాలు చూస్తుంటే.. రోడ్డు భద్రత ద్విచక్ర వాహనాలకేనా? అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. హెల్మెట్ తనిఖీలతో పాటు భారీ వాహనాలపై కూడా కఠిన నిఘా పెట్టాలి. అతివేగం, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే అడ్డుకోవడమే నిజమైన రోడ్డు భద్రత.
రోడ్డు భద్రత..
ద్విచక్ర వాహనాలకేనా?


