దమ్మపేట: మండలంలోని పూసుకుంట గ్రామపంచాయితీ పరిధి వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ప్రత్యక్షమైన కలప దుంగలను అటవీ అధికారులు మంగళవారం పరిశీలించారు. ‘పాత కేసుకు కొత్త కలప ?’శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంతో పాల్వంచ ఎఫ్‌డీఓ కృష్ణప్రసాద్, సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్డు పక్కనే ఉన్న మారుజాతి కలప దుంగలను పరిశీలించి నరికి ఎంతకాలం అయిందనే అంశంపై ఆరాతీశారు. అంతేకాక అక్కడికి సమీప ప్రదేశాల్లో చెట్లు నరికిన ఆనవాళ్లను కూడా పరిశీలించారు. కాగా, పూసుకుంట అటవీ ప్రాంతంలో మారుజాతి చెట్లను ఇటీవలే నరికినట్లు ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. ఇందులో కొండ మురళి, బిల్లుడు, చిరుమాను, నల్లమద్ది, కొడిశ తదితర మారుజాతికి చెందిన మొదళ్లు ఉండగా, వీటి దుంగలను వీరారెడ్డి గుంపుకి తరలించారా అన్నది తేలాల్సిఉంది.
పాత కేసులో కలప ఎక్కడ?
పూసుకుంట అటవీ ప్రాంతంలోనికి జేసీబీతో అక్రమంగా ప్రవేశించడమే గాక మారుజాతి కలప చెట్ల ధ్వంసానికి పాల్పడిన ఘటనపై ఏడాది క్రితం అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కలప ఇప్పటివరకు దమ్మపేట రేంజ్ కార్యాలయం, పాల్వంచ టింబర్ డిపోకు తరలించలేదు. పాత కలప ఏమైందనే విషయం అధికారులు బయటపెట్టకపోగా, ఈ స్థానంలో తాజాగా నరికిన దుంగలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎఫ్‌డీఓ కృష్ణస్రాద్ మాట్లాడుతూ వీరారెడ్డి గుంపులో ఉన్న కలప దుంగలను పరిశీలించామని, సమగ్రమైన దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
వీరారెడ్డి గుంపులో అధికారుల పరిశీలన


