భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: కుటుంబ కలహాల నేపథ్యాన మహిళపై ఆమె భర్త వేటకొడవలితో దాడిచేయగా తీవ్రగాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడుకు చెందిన మహేశ్వరి – తుర్రం శివాజీకి 20 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐదేళ్లుగా దంపతుల మధ్య విభేదాలు మొదలుకావడంతో కొన్నాళ్ల నుంచి మహేశ్వరి భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో గతంలో పలుమార్లు మహేశ్వరిపై దాడి చేసిన శివాజీ.. ఓసారి తల పగలకొట్టినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు మహేశ్వరి కుటుంబ సభ్యులు గతంలో పలుమార్లు దుమ్ముగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన మంగళవారం డ్వాక్రా సంఘం డబ్బులు కట్టేందుకు మహేశ్వరి వెళ్తుండగా శివాజీ అడ్డుకుని వేటకొడవలితో దాడి చేశాడు. ఘటనలో ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణభయంతో పరుగులు తీస్తూ కొంతదూరం తర్వాత కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎడమ చేతికి సంబంధించిన నరాలు తెగిపోవడంతో స్పర్శ లేకపోగా, మిగతా భాగాల్లోనూ తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. ఘటనపై అందిన సమాచారంతో పోలీసులు బైరాగులపాడులో పరిశీ లించడమే కాక ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.


