అక్టోబర్ 19న తుది జాబితా
ఫారాల డిజిటలైజేషన్ 86.67 శాతంగా నమోదు
13 మండలాల్లో 90 శాతానికి పైగా..
అన్ని కేటగిరీలు కలిపి...
బీఎల్‌ఓలకు అందిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను సోమవారం అర్ధరాత్రికల్లా పూర్తిచేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో డబుల్ ఎంట్రీ, మృతి చెందిన, అందుబాటులో లేని వారు, ఇతరులు కలిపి 1,32,785 మంది ఉండగా వీరి ఓట్లు జాబితా నుంచి తొలగించనున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత జాబితాను మ్యాపింగ్ చేసిన బీఎల్‌ఓలు, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. ఈమేరకు 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పారాలు పంపిణీ చేస్తే, సోమవారానికి 8,63,413 పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. 2002 జాబితాతో పోలిస్తే 78,253 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ జరగకపోగా, ఇతరత్రా కారణాలతో ఇంకొందరు ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారు.
13 మండలాల్లో 90 శాతానికిపైగా
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 86.67 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారు. అయితే, ఏ మండలంలో కూడా 100 శాతం పూర్తయిన దాఖలాలు కనిపించలేదు. మొత్తంగా అశ్వారావుపేట నియోజకవర్గం 90.36 శాతంతో మొదటి స్థానాన నిలవగా, భద్రాచలం నియోజకవర్గం 87.02 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక అత్యల్పంగా ఇల్లెందు 85.39 శాతమే నమోదైంది. ఐదు నియోజకవర్గాల్లో మృతులు 31,187 మంది కాగా, వలస వెళ్లినవారు 78, 253 మంది, డబుల్ ఎంట్రీ ఓటర్లు 14,305 మంది, అందుబాటులో లేనివారు 8,733 మంది, ఇతరులు 307 చొప్పున ఉన్నారు.
మండలాల వారీగా వాజేడు టాప్
జిల్లాలోని 23 మండలాలతో పాటు ఇక్కడి నియోజకవర్గాల పరిధి మండలాలు ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనగుతున్నాయి. ఈ మేరకు మొత్తం 13 మండలాలలో 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయింది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉండి ములుగు జిల్లాలో కొనసాగుతున్న వాజేడు మండలం 94.17 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని సుజాతనగర్ 93.89 శాతంతో దక్కించుకుంది. ఆ తర్వాత అన్నపురెడ్డిపల్లి మండలంలో 93.04 శాతం, దుమ్ముగూడెం 92.35 శాతం, ములకలపల్లి 92.34 శాతం, చంద్రుగొండ 92.29 శాతం గుండాల 92.15 శాతం, ఆళ్లపల్లి 91.93 శాతం, పాల్వంచ 91.82 శాతం, కరకగూడెం 91.37 శాతం, దమ్మపేట 90.87 శాతం, చర్ల 90.69 శాతం, వెంకటాపురం 90.13 శాతం చొప్పున డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక అత్యల్పంగా భద్రాచలం మండలంలో 73.66 శాతం, ఇల్లెందు మున్సిపాలిటీలో 76.58 శాతం, మణుగూరు 77.87 శాతమే అయింది. కాగా, డిజిటలైజేషన్ చేసిన వాటిలో మ్యాపింగ్ కాని వారు, ఇతర అభ్యంతరాలు తెలిపే వారికి ఈనెల 17 నుంచి నోటీసులు జారీ చేస్తారు. పుట్టిన తేదీని అనుసరించి కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, తల్లిదండ్రుల సర్టిఫికెట్లతో సమర్పిస్తే అర్హతల ఆధారంగా ముసాయిదా జాబితాలో చోటు కల్పిస్తారు.
జిల్లాలో 45 రోజుల పాటు నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్) తొలి విడత విజయవంతమైంది. బీఎల్వోలు, అధికారులు సమన్వయంతో శ్రమించి పొరపాట్లు జరకుండా 86.67శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటర్లు బాధ్యతగా జాబితా పరిశీలించి ఓటుహక్కు నిర్ధారించుకోవాలి. ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములైన ఉద్యోగులందరికీ అభినందనలు.
– అంకిత్, కలెక్టర్
‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదేరోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాక అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీంతో ‘సర్’ ప్రక్రియ పూర్తవుతుంది.
జిల్లాలో 1,32,785 ఓట్ల తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బీఎల్‌ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చే గడువు సోమవారంతో ముగియగా డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని 1,104 పోలింగ్
కేంద్రాల పరిధిలో 8,63,413 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా 86.67 శాతంగా నమోదైంది. తద్వారా 1,32,785 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు.
–చుంచుపల్లి


