పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం రుద్రహోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద్రమంత్రాల నడుమ స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా యాగశాలకు చేర్చారు. అక్కడ మండపారాధన, గణపతిపూజతో పాటు రుద్రహోమం నిర్వహించాక పూర్ణాహుతి సమర్పించారు.
సీజనల్ వ్యాధుల
కట్టడిపై ప్రత్యేక దృష్టి
ఇల్లెందురూరల్: సీజనల్ వ్యాధుల కట్టడిపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశించారు. ఇల్లెందు మండలం రొంపేడు, కొమరారం పీహెచ్‌సీలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రొంపేడు పీహెచ్‌సీలో రెండు గదులు కురుస్తున్నాయని, పెచ్చులు ఊడుతున్నాయని సిబ్బంది చెప్పగా మరమ్మతులకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించేందుకు గురువారం సిబ్బంది పనులు చేపట్టాలని సూచించారు. అలాగే, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇదిలా ఉండగా రెండు పీహెచ్‌సీల్లో విధులకు గైర్హాజరైన సిబ్బందికి మెమో జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. తనిఖీల్లో వైద్యులు సుకృత, నవీన, సిబ్బంది పాల్గొన్నారు.
‘యువ ఆపదమిత్ర’ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యాన సామాజిక స్పృహ కలిగిన యువతకు ‘ఆపదమిత్రలు’గా శిక్షణ ఇవ్వనున్నట్లు మేరా యువ భారత్ జిల్లా కోఆర్డినేటర్ మద్దుల వెంకటరాంబాబు తెలిపారు. వరదలు, భూకంపాలు వంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా ఉండడానికి యువతకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. వారం పాటు చాతకొండ బెటాలియన్‌లో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లావాసులై 18 – 40 ఏళ్ల వయస్సు కలిగి, కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు మై భారత్ కార్యాలయం(నెహ్రూ యువకేంద్రం)లో లేదా 91773 29258 నంబర్‌లో సంప్రదించాని సూచించారు.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
భద్రాచలంఅర్బన్: ఖమ్మం రీజియన్ పరిధి గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మొత్తం 21 పోస్టులు భర్తీ చేయనుండగా, సంబంధిత సబ్జెక్టు పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు ఎన్‌ఈటీ/ఎస్‌ఈటీ/ పీహెచ్‌డీల్లో ఏదైనా ఒక అర్హత ఉండాలన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మహిళా కళాశాలల్లో 12, టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ(మణుగూరు)లో తొమ్మి ది పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ధ్రువపత్రాల జిరాక్స్‌లతో ఈనెల 13న సాయంత్రం 5 గంటల్లోగా పాల్వంచలోని కేఎల్‌ఆర్ పీజీ కళాశాలలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని, వివరాలకు 98489 65711 నంబర్‌లో సంప్రదించాలని పీఓ తెలిపారు.


