భద్రాచలంఅర్బన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో జీపీఎస్, ఏపీఎస్, ఏహెచ్‌ఎస్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్దీపకం వర్క్‌బుక్–3పై ఇచ్చే శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిలో నైపుణ్యాలను బలోపేతం చేయాలని తెలిపారు. గతంలో ఉద్దీపకం వర్క్‌బుక్–1, 2 ద్వారా విద్యార్థుల చదువులో మెరుగుదల కనిపించిందని, వర్క్‌బుక్–3లో ఇంగ్లిష్, గణితం, తెలుగు అంశాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, రోబోటిక్స్, భారతీయ సంస్కృతి, వ్యవసాయం తదితర అంశాలను చేర్చినట్లు చెప్పారు. జీపీఎస్‌ల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయుల్లో ప్రతినెలా ఇద్దరిని సన్మానిస్తామని తెలిపారు. కాగా, వర్క్‌బుక్‌పై గేయం రచించిన మణుగూరు మండలం ఇప్పలసింగారం జీపీఎస్ ఉపాధ్యాయుడు రాఘవేంద్రను పీఓ అభినందించారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఏటీడీఓలు తదితరులు పాల్గొన్నారు.


