అమృత్‌ ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ ఆలస్యం!

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

తెరపైకి పుష్కరాల పనులు

భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌లో సగం కూడా పూర్తికాని పనులు మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, భక్తులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అమృత్‌ భారత్‌ నిధులతో భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనుల తీరు చూస్తుంటే ఇల్లు తీసేసి పందిరివేసిన చందంగా మారింది. మూడేళ్లు గడిచినా ఏ ఒక్క పనీ పూర్తి కాలేదు. స్టేషన్‌ రూపు రేఖలు మారుస్తామనే ప్రభుత్వ ప్రకటన చివరకు ప్రతి కూల ఫలితాలు చూపుతోంది.

మూడేళ్ల క్రితం మొదలు

అమృత్‌ భారత్‌ పథకం కింద భద్రాచలంరోడ్‌ (కొత్తగూడెం) స్టేషన్‌ అభివృద్ధికి రూ.25.41కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. ఈ పనులను 2023 ఆగస్టు 6న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. స్టేషన్‌కు కొత్త ఆర్చ్‌, పోర్టికో నిర్మించి, సర్క్యులేటింగ్‌ ఏరియాను అభివృద్ధి చేయాల్సి ఉంది. ర్యాంప్‌, ఎస్కలేటర్‌, లిఫ్టులు అందుబాటులోకి తేవాల్సి ఉంది. వీటితోపాటు ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న కొత్త టాయిలెట్ల నిర్మాణం, పాత టాయిలెట్ల ఆధునికీకరణ, కొత్త పైకప్పు, ఎల్‌ఈడీ కోచ్‌ ఇండికేటర్‌ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనుల కోసం స్టేషన్‌లో ఉన్న పాతనిర్మాణాల్లో చాలావాటిని తొలగించా రు. అదే వేగం నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కనిపించడం లేదు. ఫలితంగా స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.

సగం పనులే పూర్తి

మూడేళ్ల క్రితం మొదలైన అమృత్‌ భారత్‌ పనులు ఇప్పటివరకు 50నుంచి 60 శాతమే పూర్తయ్యాయి. నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో స్టేషన్‌కు వచ్చి పోయే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాట్‌ఫారమ్‌పై కోచ్‌ ఇండికేటర్లు లేక స్లీపర్‌, ఏసీ బోగీలు ఎక్కడ ఉన్నాయో తెలియక తికమక పడుతున్నారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఈ చివర నుంచి ఆ చివరకు నడవలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్‌ హాల్స్‌, క్యాంటీన్‌ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో పుణ్యక్షేత్రమైన భద్రాచలం నుంచి రాకపోకలు సాగించే భక్తులు కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలి పెరిగినా, వర్షం కురిసినా మహిళలు, పిల్లల బాధ చెప్పనలవికానివిగా ఉంటున్నాయి. ఈ ఇక్కట్లకు తాళలేక అమృత్‌ భారత్‌ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం ఎదురవుతోంది. అయినా రైల్వేశాఖ నుంచి స్పందన రావడం లేదు.

అమృత్‌ భారత్‌ పనుల పరిస్థితి అలా ఉంటే కొత్తగా ఇక్కడ పుష్కరాల పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌/జూలైలో జరగబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంరోడ్‌ స్టేషన్‌లో భక్తులు బస/విశ్రాంతి/విచారణ కేంద్రాలు/హెల్ప్‌లైన్‌/ రద్దీ నియంత్రణ వంటి పనులకు ప్రణాళిక సిద్ధమైంది. స్టేషన్‌లో డౌన్‌లైన్‌కు ఎడమ వైపు, న్యూ గొల్లగూడెం దిశలో ప్రస్తుతం జంగిల్‌ క్లియరెన్స్‌, నేల చదును పనులు మొదలయ్యాయి.

అమృత్‌ భారత్‌ పథకం పనుల్లో తీవ్ర జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement