ల్యాబ్‌లు 130.. తనిఖీలు 18 చోట్లే.. | - | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌లు 130.. తనిఖీలు 18 చోట్లే..

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

● నిర్లక్ష్యం వీడని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ● ఇష్టారాజ్యంగా మెడికల్‌ ల్యాబ్‌ల నిర్వహణ ● పరీక్షలకు నిర్దేశిత ధరల కంటే అధికంగా వసూళ్లు

నిబంధనలు పాటించకుంటే చర్యలు

● నిర్లక్ష్యం వీడని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ● ఇష్టారాజ్యంగా మెడికల్‌ ల్యాబ్‌ల నిర్వహణ ● పరీక్షలకు నిర్దేశిత ధరల కంటే అధికంగా వసూళ్లు

చుంచుపల్లి: మెడికల్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు, పూర్తి స్థాయి అనుమతి పత్రాలు, అర్హతా ప్రమాణాలు పాటించకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. రక్త, ఇతర పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. బయోవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హతలు లేనివారితో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేయిస్తున్నారు. అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఉదాసీనత వీడటంలేదు. తనిఖీ బృందాలు మొక్కుబడిగానే పనిచేస్తున్నాయి.

రిపోర్టుల్లో పొరపాట్లు వస్తే..

జిల్లా వ్యాప్తంగా 130 మెడికల్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు వంటి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, షుగర్‌, థైరాయిడ్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, కాలేయం, మూత్రపిండాల పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రులు, క్లీనిక్‌లకు అనుబంధంగా, మరికొన్నిచోట్ల స్వతంత్రగా రక్త పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 130 ల్యాబ్‌లు ఉండగా, ఏడాది కాలంలో కేవలం 18 మాత్రమే తనిఖీ చేశారు. వీటిల్లో నిబంధనలు ఉల్లంఘించిన 13 ల్యాబ్‌లకు రూ.1.15 లక్షల జరిమానా విధించారు. మిగితా 112 ల్యాబ్‌లను ఎందుకు తనిఖీ చేయలేదనేది వైద్యాఆరోగ్యశాఖ అధికారులే వెల్లడించాల్సి ఉంది. పరీక్షల ఫలితాల ఆధారంగా వైద్యులు చికిత్స అందించాల్సి ఉండటంతో, ఫలితాల్లో చిన్న పొరపాటు జరిగినా రోగ నిర్ధారణ, మందుల మోతాదు, తదుపరి చికిత్సపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వైద్యులకు కమీషన్లు

సీజనల్‌ జ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, వైరల్‌ జ్వరాలు వ్యాపిస్తే ల్యాబ్‌ల నిర్వాహకులు బాధితులను పీల్చిపిప్పి చేస్తున్నారు. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా నాడీ పట్టకుండానే బీపీ, షుగర్‌, మూత్రపరీక్ష చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. రక్తపరీక్షలకు రూ. 1000 నుంచి రూ.5వేల వరకు బిల్లులు చేస్తున్నా రు. దీంతో కొంత వైద్యులు కూడా కమీషన్‌ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అర్హతలేనివారితో విధులు

డీఎంఎల్‌టీ, ఎంఎస్సీ ఎంఎల్‌టీ, బీఎస్సీ ఎంఎల్‌టీ తదితర అర్హతలు కల్గిన వారు ల్యాబ్‌ ఏర్పాటుకు చేసుకునేందుకు అర్హులు. అలాగే, వివిధ శాఖల నుంచి పూర్తి స్థాయి అనుమతిపత్రాలు, తనిఖీలు పూర్తి చేశాక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీచేస్తారు. ఆ తర్వాతే ల్యాబ్‌ను అధికారికంగా ప్రారంభించాలి. కానీ చాలామంది అన్ని అనుమతులు రాకపోయినా అధికారులను మేనేజ్‌ చేస్తూ ల్యాబ్‌లు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌ల్లో పాథాలజిస్టులు కూడా ఉండటంలేదు.

మెడికల్‌ ల్యాబ్‌లను పర్యవేక్షిస్తున్నాం. నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కొందరికి జరిమానాలు కూడా విధించాం. త్వరలో మరోసారి తనిఖీలు చేపడతాం. అర్హత లేని ల్యాబ్‌లపై క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్‌ తుకారాం రాథోడ్‌, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement