మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గని (కేపీయూజీ) రానున్న రోజుల్లో మెగా ఓసీగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కేపీయూజీ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గుకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. అయితే ఉత్పత్తికి తరచూ అవాంతరాలు ఏర్పడటం, ప్రారంభం నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర రాకపోవడంతో పీకేఓసీ–2 డిప్ సైడ్, కేపీయూజీని కలిపి మెగా మైన్‌గా మార్చాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓసీ–2, ఓసీ–4ను కలిపి పీకేఓసీగా పిలుస్తుండగా, ఓసీ–2 డిప్ సైడ్ సైతం తాజాగా సింగరేణికి దక్కింది. దీంతో కేపీయూజీ, ఓసీ–2కు మధ్య ప్రవహించే గొర్రెపేట వాగును కేపీయూజీకి ముందు భాగానికి మళ్లించి, ఇప్పుడున్న గొర్రెపేట వాగును, కొండాపురం భూగర్భగనిని, ఓసీ–2 డిప్‌సైడ్‌ను కలిపి మెగా ఓసీగా మార్చాలని భావిస్తున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖకు ప్రతిపాదనలు, పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
2016లో ప్రారంభం
2016లో కేపీయూజీ ప్రారంభించారు. ఏడాదికి 5 లక్షల టన్నుల చొప్పున 20 ఏళ్లపాటు బొగ్గు వెలికితీయాలని నిర్ణయించారు. నాణ్యమైన జీ–6 బొగ్గు ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు పొరల్లో అవాంతరాలు, వేడినీటి ఉబికి రావడంతో కార్మికులు పనిచేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వెనుకంజలో ఉంది. ఈ క్రమంలో మెగా ఓసీగా మార్చాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేపీయూజీ, ఓసీ–2 డిప్ సైడ్‌లను కలిపి
ఓపెన్‌కాస్టు ఏర్పాటుకు సింగరేణి కసరత్తు..


