నియోజకవర్గాల వారీగా మృతులు, వలస, డబుల్ ఓటర్ల వివరాలు..
సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ వివరాలు..
● జిల్లాలో 31,083 మృతులకు ఓటు హక్కు ● జాబితాలో వలస ఓటర్లు 77,280 మంది ● జిల్లాలో తొలగించనున్న ఓట్లు 1,30,914 ● నేటితో ముగియనున్న సర్ ప్రక్రియ
చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓటరు జాబితాల పరిశీలనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ధ్రువీకరణలో ఇప్పటికే మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. కొంతకాలంగా ఓటరు జాబితాల్లో మార్పు లు నమోదు కాకపోవడం, కుటుంబ సభ్యులు మరణాల వివరాలను ఎన్నికల అధికారులకు తెలపకపోవడం వల్ల మృతుల పేర్లు జాబితాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. సర్ ప్రక్రియలో బీఎల్‌ఓలు వారి పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టగా.. ఒకే కుటుంబంలో మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన, రెండు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లు వెలుగుచూస్తున్నాయి. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఆధారాలను పరిశీలించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 31,083 మంది మృతులకు ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. మృతులు ఏళ్ల తరబడి ఓటరు జాబితాలోనే ఉన్నారని తెలిసింది. మృతుల ఓట్లు ఎక్కువగా ఇల్లెందులో 10,009, కొత్తగూడెం 6,391 ఓట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 4,101 మంది మృతులు ఉన్నారు. స్థానికంగానే కాకుండా మరోచోట ఓటు నమోదు చేసుకున్నవారు 14,123 మంది ఉన్నారు.
356 మంది
‘సర్’ పత్రాలు ఇవ్వలేదు..
జిల్లా నుంచి వలస వెళ్లిన ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. బీఎల్‌ఓల నుంచి ఎన్యుమరేషన్ పత్రా లను పంపిణీ చేసినా అందుబాటులో లేనివారు 8,072 మంది ఉండటం గమనార్హం. మిగిలిన ఇతర కారణాలతో సైతం 356 మంది పత్రాలను ఇవ్వలేదు. వీరంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారా..? రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం వల్ల పత్రాలు తిరిగి ఇవ్వలేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లారని, వారి వివరాల సేకరణకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని బీఎల్‌ఓలు, అధికారులు అంటున్నారు.
నేటి వరకే గడువు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువు ముగియనుంది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,104 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తికానుంది. దీంతో బీఎల్‌ఓలు, సిబ్బంది తుది లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 9,96,198 మంది ఓటర్లకు జూన్ 25 నుంచి ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన గడువు ప్రకారం ఈ నెల 10 వరకు వీటిని సేకరించి, 100శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వాస్తవంగా దీని గడువు గత నెల 24తో ముగిసినా.. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజులు అవకాశం ఇచ్చారు. దీనిలో తిరిగి ఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్‌లో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓట్లను గుర్తించారు. 2002, 2025 ఓటర్ల జాబితా ప్రకారం బీఎల్‌ఓలు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 9,96,198 మంది ఓటర్లకు గాను, 8,61,360 మంది వివరాలను గురువారం వరకు అందించారు. దీంతో 86.46 శాతంతో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మృతులు, వలస ఓటర్లు, రెండేసి ఓట్లు ఉన్నవారు, అందుబాటులో లేనివారిపై ప్రత్యేక దృష్టి సారించిన బీఎల్‌ఓలు విభాగాల వారీగా పునః పరిశీలన చేసి అందుబాటులో ఉన్నవారి వివరాలను ఆన్‌లైన్ చేశారు. మ్యాపింగ్ కానీ ఓటర్లకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గడువు అనంతరం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారు నిర్దేశిత పత్రాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సేకరించని ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి (అన్‌కలెక్టబుల్) మృతులు, శాశ్వత వలసలు, రెండేసి ఓట్లు ఉన్నవారు, అందుబాటులో లేనివారి ఓట్ల లెక్క తుది దశకు చేరింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక ఈ నెల 10 నుంచి వీటిని పూర్తిగా తొలగించనున్నారు. జిల్లాలో తొలగించే ఓట్లు సుమారు 1,30,914 వరకు ఉన్నాయని అధికారులు ప్రాథ మికంగా అంచనాకు వచ్చారు. సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 17న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిచిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో ఓటు కోల్పో యి, అర్హత ఉంటే మళ్లీ నమోదుకు ఫారం–6 దర ఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
నియోజవర్గం మృతులు వలస ఓటర్లు డబుల్ ఓటర్లు అడ్రెస్ లేనివి ఇతరులు మొత్తం
పినపాక 6,353 19,131 2,565 1,935 71 30,055
ఇల్లెందు 10,093 17,736 4,521 992 35 33,377
కొత్తగూడెం 6,391 18,080 3,899 3,444 119 31,933
అశ్వారావుపేట 4,143 9,018 1,527 720 104 15,514
భద్రాచలం 4,101 13,315 1,611 981 27 20,035
మొత్తం 31,083 77,280 14,123 8,072 356 13,0914
నియోజవర్గం పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు డిజిటల్ అయినవి శాతం
పినపాక 245 2,04,518 1,74,433 85.29
ఇల్లెందు 243 2,28,211 1,94,827 85.31
కొత్తగూడెం 253 2,50,085 2,14,265 85.65
అశ్వారావుపేట 184 1,60,221 1,44,707 90.32
భద్రాచలం 179 1,53,163 1,33,128 86.92
మొత్తం 1,104 99,6198 86,1360 86.46


