భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాల వద్ద ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు నదీహారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితుల సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్, పురోహితులు అశోక్ కుమార్ శర్మ, సత్య ప్రసాద్, పవన్ కుమార్, రామాచార్యులు, చంద్రశేఖర్, తిరుపతిరావు, ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి, నరసింహ శర్మ, తేజ శర్మతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
భద్రగిరి రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
14 నుంచి శ్రావణ మాసోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రత్యేక సేవలు, 17న సింహ సంక్రమణం, 18న సుదర్శన నారసింహస్వామి పూజలు, 21న వరలక్ష్మీ వ్రతం, 23న అంకురార్పణ, 24న ద్వాదశి, 25న వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. 26 నుంచి 28 వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి, 8న శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.


